Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నిందితులు హరీశ్, సంస్థ నిర్వాహకులు
శ్రీనివాస్‌రావులకు యావజ్జీవ శిక్ష
అ తీర్పు వెల్లడించిన మొదటి అదనపు జిల్లా
సెషన్స్ కోర్టు జడ్జి నాగరాజు
అ ఫలించిన గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ
పోరాటం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో ఎనిమిదేండ్ల క్రితం సంచలనం సృష్టించిన బాలికల లైంగికదాడి కేసులో గురువారం నల్లగొండ జిల్లా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ తీర్పులో లైంగికదాడి చేసిన వ్యక్తి, సంస్థ నిర్వాహకులకు యావజ్జీవ శిక్షను ఖరారు చేశారు. నాగార్జున సాగర్ నియోజక వర్గంలోని పెద్దవూర మండలం ఏనెమీది తండాలో 2014 జనవరి 3వ తేదీన 12మంది బాలికలపై అదే గ్రామానికి చెందిన రమావత్ హరీశ్ నాయక్ లైంగిక దాడికి పాల్పడ్డట్టు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితునికి వ్యతిరేకంగా అన్ని రకాల సాక్ష్యాలను సేకరించారు. దీనిపై జిల్లా మొదటి అదనపు కోర్టులో బలమైన వాదనలు నడిచాయి. అయితే ప్రాసిక్యూషన్ కూడా ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ వాదనలు బలంగా వినిపించింది. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ సంఘటన కూడా అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. ఆ ఘటనలో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష పడేలా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరిగిరి వెంకటరెడ్డినే ఇపుడు కూడా ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వాదనలు వినిపించారు.
కేసు విచారణ
ఏనెమీది తండాలో వీఆర్వో అనే స్వచ్భంద సంస్థను 1997 ప్రారంభించారు. 2014 జనవరి 3న 12మంది ్ బాలికలపై ఆ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న అదేగ్రామానికి చెందిన హరీశ్‌నాయక్ లైంగిక దాడి చేశారని చేసిన ఫిర్యాదు మేరకు క్రైం నెంబర్ 3/14 కింద కేసును అప్పటి పెద్దవూర ఎస్ఐ ఇండ్ల వెంకటయ్య ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. 2014 జనవరి5 నిందితులను రిమాండ్‌కు పంపించారు. నేటి ఎస్పీ శ్రీమతి రెమారాజేశ్వరీ అప్పట్లో కేసు పర్యవేక్షణ చేయగా నేటి మిర్యాలగూడ డీిఎస్పీ సుభాష్ చంద్రబోస్ ( ప్రస్తుతం ఖమ్మం జిల్లా అదనపు ఎస్పీ) ఆధ్వర్యంలో పూర్తి కేసు విచారణ చేపట్టారు. ప్రస్తుత దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి అప్పట్లో హాలియా సిఐగా పనిచేస్తూ ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించారు. మొత్తంగా ఎఫ్ఐఆర్ నెంబర్లు 3 నుంచి 14వరకు నమోదు చేశారు.
తీర్పు వెల్లడించిన జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు
ఏనెమీది తండా బాలికలపై ఆఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిపై జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు జడ్జీ నాగరాజు తుది తీర్పు వెల్లడించారు. ఏ-1 నిందితుడు రమావత్ హరీష్నాయక్కు యావజ్జీవ కారాగార శిక్ష , రూ.10వేల జరిమానా ఖరారు చేయగా ఏ-2 సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్‌రావుకు యావజ్జీవ కారాగార శిక్ష , విధించారు. కేసులో ఏ-3గా ఉన్న నిర్వాహకులు సరితకు ఆరు నెలల జైలు శిక్ష , జరిమానా విధించారు. ఈ కేసులో నిందితులు హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి కోర్టు అవకాశం కల్పించింది.
గిరిజన సంఘం , ఎస్ఎఫ్ పోరాట ఫలితమే ..
బాలికలపై ఆఘాయిత్యానికి పాల్పడ్డ హరీష్ నాయక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నాడు గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. నాడు కొంతమంది ఈ ఘటనను డబ్బులతో మూసేయాలని భావిస్తే గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాంతో బాధిత పిల్లలకు నల్లగొండ జిల్లా కేంద్రంలో హోంలో ఆశ్రయం కల్పించారు. ఆ మరుసటి రోజే సంఘాల ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ సెంటర్లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ఘటనను నాడు ఎలక్ట్రానిక్ మీడిమా లైవ్ చూపించింది. అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. అసెంబ్లీ సాక్షిగా నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించి నిందితుడికి కఠిన శిక్ష పడేవరకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తీర్పు ఆలస్యమైన బాధితులకు న్యాయం చేస్తూ దోషులకు శిక్ష విధించడం పట్ల గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ధీరావత్ రవినాయక్ న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఘటనల పట్ల విచారణ వేగవంతం చేసి సత్వర న్యాయం చేయాలని న్యాయవ్యవస్థకు విన్నవించారు.