Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి
నన్నూరి వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
చింతపల్లి మండలం విరాట్‌నగర్‌లో మహంకాళీ విగ్రహం వద్ద వ్యక్తి తలనరికి చంపిన నరబలి ఘటనను జనవిజ్ఞాన వేదిక తీవ్రంగా ఖండిస్తోందని ఆ వేదిక రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వద్దిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చింతపల్లి మండలంలోని విరాట్ నగర్లో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకీడు మండలానికి చెందిన జయేందర్ నాయక్ తలను మహంకాళీ విగ్రహం కాళ్ల వద్ద ఉంచడం గమనిస్తే నరబలి చేసినట్టుగా అర్థమవుతుందన్నారు. నరబలి జరగడం వాస్తవం అయితే ప్రస్తుత శాస్త్ర సాంకేతిక ప్రపంచంలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం అమానుషమన్నారు.పోలీసులు త్వరితగతిన విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరారు.నరబలి వల్ల ఎలాంటి అతీతశక్తులు రావని, ఎలాంటి ప్రయోజనం చేకూరదని ప్రజలు గ్రహించాలని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా మూఢనమ్మకాలను విడిచిపెట్టి సమాజ హితం కోసం ఆలోచించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కతిక కార్యదర్శి నల్ల నర్సింహా, గుర్రంపోడ్ మండల కార్యదర్శి బోయపల్లి సైదులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.