Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-తిప్పర్తి
శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి మరొక్క దిక్కు లాభాల్లో నడుస్తున్న సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ నిరుద్యోగాన్ని మరింత పెంచిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పగించిందన్నారు. వారికి అనుకూలంగా చట్టాలను తెచ్చి పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి ప్రజల హక్కులను కాలరాసిందని విమర్శించారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర బడ్జెట్లో గత సంవత్సరం కంటే 30 వేల కోట్లను తగ్గిస్తూ వ్యవసాయ కార్మికుల పని దినాలను దెబ్బ తీసిందన్నారు. దీని మూలంగా వ్యవసాయ కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. పనులు తగ్గిపోవడం కరోనా కష్ట కాలంలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యారన్నారు. మరొక దిక్కు ఆర్థిక దోపిడీి ,నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వ్యవసాయ పేదల బతుకులు చిన్నా భిన్నం అయ్యాయన్నారు. కష్ట కాలంలో పేదలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం అందులో పనిచేసిన కూలీల వేతన బకాయిల విడుదల చేయాలని, 200 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజు కూలి రూ.600 ఇవ్వాలని జరిగే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలోని గోదాముల్లో లక్షలాది టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నా అనేక మంది వ్యవసాయ పేదలు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. వారి ఆకలి తీర్చుటకు కేంద్ర ప్రభుత్వం నిల్వ ఉన్న ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వామపక్షాల పోరాటాల మూలంగా అటవి హక్కుల చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.గిరిజన పేదలు సాగు చేసుకుంటున్న భూములను పట్టాలిచ్చి రక్షణ కల్పించాలని తెచ్చిన చట్టాన్ని ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పోడు భూముల రక్షణకు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చి, రైతు బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేయాలని కోరారు. కరోనా మూడవ దశ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికీ రూ. 7500 రూ.,30 కిలోల బియ్యం, 15 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు,రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొజ్జా చినవెంకులు, నారి ఐలయ్య, జిల్లా నాయకులు కత్తుల లింగస్వామి, మన్నెం భిక్షం, ఆర్.రవినాయక్, పిల్లుట్ల సైదులు, మారోజు చంద్రమౌళి, రెమిడాల భిక్షం, బాల సైదులు, రమేష్ బాబు పాల్గొన్నారు.