Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-నల్లగొండ
గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ, నరేగా పనులు, పల్లె ప్రగతి అభివృద్ధి పనులు తదితర అంశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా, కమిషనర్ డాక్టర్ శరత్లతో కలిసి మంగళవారం ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మూడవ దశ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్యం అంశంలో అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, అవసరమైన మేర హైడ్రోక్లోరిక్ స్ప్రే చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. 15 నుంచి18 పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలని అధికారులకు మంత్రి సూచించారు. మెడికల్ సిబ్బంది, 60 ఏళ్ళ పైబడిన వారికి బూస్టర్ డోస్ అందజేయాలని మంత్రి తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు అధికంగా నిర్వహించాలని, గ్రామాల్లో అధిక మొత్తంలో ప్రజలకు ఉపాధి కల్పించాలని, చెరువుల పూడిక తీతలు, కాలువ మరమ్మతు పనులు, పిచ్చి మొక్కలు తొలగింపు పనులు చేపట్టి వీలైనంత మేర ఉపాధిహామీ నిధులను వినియోగించుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి గ్రామంలో నిర్మించిన శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులను వినియోగించాలని మంత్రి తెలిపారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, వైకుంఠధామం ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా జాబ్ కార్డు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద జిల్లాలో ప్రతి గ్రామం లో జాబ్ కార్డు కలిగిన కూలీ లకు పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి వారం ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్ సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్, పంచాయతీ రాజ్ ఎస్ఈ. జీజేవీవీ ప్రకాష్, ఈ. ఈ తిరుపతయ్య, ఎంపీడీఓలు సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.