Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రతిభా ఎవరి సొత్తు కాదని, ఎంత పేదవారైనా, అంటరాని కులం వారైనా ప్రపంచ మేధావిగా ఎదగవచ్చని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించారని ఉస్మానియా, తెలంగాణ విశ్వవిద్యాలయాల డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. భారతదేశంలో తొలిసారిగా గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఆయన ప్రతిభను గుర్తించిన సందర్భంగా 2013 నుంచి జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. బుధవారం యూనివర్సిటీలోని న్యాయ కళాశాలలో నిర్వహించిన జాతీయ ప్రతిభావంతుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొ. గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ న్యాయ పరిశోధనలో ప్రతిభావంతులైన వారికి ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ విభాగం చరిత్రలో మొదటిసారిగా డీన్ అవార్డు 2022 ఇవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా ఈనెల 22కి వాయిదా వేసినట్టు తెలిపారు. కేంద్రప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో ఒక మతం పునాదిగా అశాస్త్రీయమైన పద్ధతిలో పెట్టుబడిదారులకు అనుకూలంగా నూతన విద్యా విధానానికి రూపకల్పన చేసిందన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయం పునాదిగా అన్ని వర్గాలకు నూతన విద్యా విధానం ఉండాలని, అప్పుడే విద్య ద్వారా వ్యక్తి, సమాజ వికాసం జరుగుతుందన్నారు. ఆ దిశగా అంబేద్కర్ స్ఫూర్తితో ఓయూను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఓయూ వీసీ అధికారికంగా అనుమతి ఇవ్వని కారణంగా ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని చెప్పారు. సమావేశంలో దళిత బహుజన విద్యార్థి సంఘ నాయకులు జంగిలి దర్శన్, దక్షిణ భారత పరిశోధక విద్యార్థి జేఏసీ నాయకులు దుర్గం శివ, శ్రీనివాస్, అవినాష్, దపు మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందే భాస్కర్, రఘు గాలి గౌతమ్ రాజ్, గాలి రాబిన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.