Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
మునుగోడు మండల కేంద్రంలోని చిట్యాల రోడ్డులో గల ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న 12 ఫీట్ల మురుగుకాల్వకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు దానిపై అక్రమ కట్టడాలు నిర్మించడంతో ఎస్సీ కాలనీలోని మురుగునీరు పోవడానికి వీలు లేకుండా మారింది. దాంతో ఆ కాలనీవాసులు వ్యాధుల బారిన పడుతున్నామని, వివిధ రాజకీయ పార్టీలు, పలు దళిత, విద్యార్థి సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు చేపట్టాయి. దీంతో స్పందించిన గ్రామపంచాయతీ పాలకవర్గం బుధవారం పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేశాయి.
అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదు : డీఎస్పీ
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా సహించేది లేదని డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం నల్గొండ ప్రధాన రహదారి నుంచి చౌటుప్పల్, చండూర్, చిట్యాల వెళ్లే రహదారులకు ఇరువైపులా రోడ్డుపైనే తోపుడు బండ్లు ఉండడంతో వాహనదారులకు రాకపోకలకు అంతరాయం కలగడంతో వాటిని తొలగించారు. రాకపోకలకు ఆటంకం కలిగే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సుమలత, ఎస్ఐ సతీష్ రెడ్డి, మునుగోడు సర్పంచ్ వెంకన్న, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్.మురళి మోహన్, వివిధ మండలాల ఎస్ఐలు, ఏఎస్ఐ పాల్గొన్నారు