Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
లక్షల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. అయినా అధికారులు మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణ ప్రాంతంలో 651 సర్వేనెంబర్లో 81 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఉన్న గుట్టను ఎలాంటి మైనింగ్ పర్మిషన్ లేకుండా తొలగించి చదునుచేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. ఇది చిట్యాల నుంచి భువనగిరి రోడ్డుకు ఆనుకొని ఉంది. అయినా అధికారులు నోరు మెదపడం లేదు. దాంతో స్థానికుల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆక్రమణదారుల నుంచి భారీగా ముడుపులు అందబట్టే సంబంధిత అధికారులు మౌనం పాటిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇక్కడ కొందరు ఇడ్లను నిర్మిస్తుండగా తహసీల్దార్ ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. ఎవరైనా కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయినా కొందరు రియల్ వ్యాపారులు దానిని తొలగించి యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.