Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ-నల్లగొండ
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల కూలిరేట్ల పెంపు కోసం యజమానులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య కోరారు. గురువారం కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహ్మద్ హలీంకు మెమోరాండం అందచేసి మాట్లాడారు.డిసెంబర్ 31తో కూలి రేట్ల ఒప్పంద గడువు ముగిసిందని, నూతన రేట్ల పెంపుదల కోసం గత మూడు నెలలుగా యజమానులకు నోటీసులు ఇస్తున్నప్పటికీ మొండి వైఖరితో ఉన్నారని అన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అద్దె ఇళ్లలో నివాసం ఉండటంతో వేతనాలు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 5 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న పవర్లూమ్ కార్మికుల కూలి రేట్లు పెంపుదల కోసం కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకుని యజమానుల కార్మికుల మధ్య జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి సహకరించాలని కార్మిక శాఖ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు పెండెం రాములు, జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు, పద్మా నగర్, ఇండిస్టియల్, చెర్లపల్లి ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు బొగు సత్యనారాయణ, పెండెం బుచ్చిరాములు, చిట్టిపోలు వెంకటేశం, ఆంజనేయులు, గిరిబాబు, రమేష్ పాల్గొన్నారు.