Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ, సీడబ్ల్యూఎఫ్ఐ) 2022 క్యాలెండర్ను గురువారం జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మహ్మద్ హలీమ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ హలీమ్ మాట్లాడుతూ ఈ డైరీ లో కార్మికులకు సంబంధించి అన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎన్ని రకాల కార్మికులున్నారు, కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తు ఫారాలు, సంక్షేమ పథకాల జీవోలు పొందుపరచడం ఆనందకరమన్నారు. కార్మికులందరూ ఈ డైరీ ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు అని అన్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న పాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అవగాహన కల్పించే విధంగా ఈ డైరీ ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి నరసింహ, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అద్దంకి నరసింహ, సెంట్రింగ్ యూనియన్ కార్యదర్శి వెంకట్రెడ్డి , కార్పెంటర్ యూనియన్ కన్వీనర్ సలీవోజు సైదాచారి, శ్రీనివాసాచారి, మన్నే శంకర్, అంజయ్య, తాపీ సంఘం నాయకులు భూతం వెంకటయ్య, గుంటోజు సోమయ్యచారి,, ముక్కామల యాదయ్య, దాసోజు ప్రభుచారి పాల్గొన్నారు.