Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 75ఎకరాల్లో 1,008 హోమాలు
అ ఆరు వేల రుత్వికులు
అ కొండపైన బస్ వేకు రూ.10కోట్లు
అ యాదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రిలో ఈ ఏడాది మార్చి 21 నుండి మహా సుదర్శన యాగం, అలాగే 28వ తేదీన మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంతో పాటు అదే రోజు నుండి ప్రధానాలయం యాదాద్రీశుడి స్వయంభు దర్శనాలు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. శుక్రవారం యాదాద్రికి మంత్రి విచ్చేసిన సందర్భంగా బాలాలయంలోని స్వామి అమ్మవారలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికగా ప్రధాన పూజారి నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని ఈవో గీత మంత్రికి అందజేశారు. అనంతరం నిర్వహించిన వైటీడీఏ అధికారులతో సమీక్షలో మంత్రి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఆ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌లతో కలిసి పలు వివరాలను మీడియాకు వెల్లడించారు. మహా సుదర్శన యాగం సమయంలో ప్రతి రోజు లక్ష మంది భక్తులకు అన్న ప్రసాదం అందజేయడానికి సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించారు. 75 ఎకరాల్లో 1008 హోమాది కుండలతో, 6వేల మంది రుత్వికులతో ఈ మహా యాగం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం యాగానికి సంబంధించి ఇప్పటికే చినజీయర్ స్వామీజీ నుండి 24 అంశాలకు సంబంధించిన సామాగ్రి లిస్టు వచ్చిందన్నారు. భక్తుల కోసం కొండపైన బస్ వేకు సంబంధించి రూ.10కోట్లు మంజూరుయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధానాలయం పనులన్నీ 99శాతం పూర్తి అయ్యాయని, ద్వజస్తంభం బంగారం తాపడానికి మిగిలిన పనులతోపాటు సప్త గోపురాలపై కలశాల బిగింపు పనులు, క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట, దీక్షపరుల మండపం పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి అవుతాయని తెలిపారు. ఇప్పటికే ప్రెసిడెన్సియల్ సూట్ పూర్తి కాగా ఎంట్రీ ప్లై ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన కేబుల్ లండన్ నుంచి తీసుకురావాల్సి ఉందదన్నారు. ఆ పనులు మార్చి 20వ తేదీ వరకు పూర్తి అయ్యే అవకాశముందన్నారు. ఇంత పెద్ద దేవాలయం అభివద్ధి చెందుతున్న నేపథ్యంలో అందరికి సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారని, నిరుద్యోగులు అధైర్యపడొద్దని వెల్లడిించారు.
యాదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన సాగిందిలా
మహాకుంభ సంప్రోక్షణకు గడువు సమీపిస్తుండగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆలయ అభివద్ధి పనులను మంత్రి పరిశీలించారు. కొండపైన నిర్మాణాలను పరిశీలించిన మంత్రి పనులకు సంబంధించిన వివరాలు వైటీడీఏ వైస్ చైర్మెన్ జి.కిషన్ రావు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, ఆలయ ఇన్‌చార్జ్జి ఈవో గీతారెడ్డి, స్తుతి ఆనంచారివేలులను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లు, ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ , ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఉన్నారు.
మంత్రిని అడ్డుకున్న వర్తకులు
యాదాద్రి ఆలయ అభివద్ధి పనుల పరిశీలనకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయిని కొండపైన ఈవో కార్యాలయం ముందు సుమారు గంట పాటు దీక్షలు చేస్తున్న వర్తకులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని, కొండపైన దుకాణాలు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.