Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మణిమద్దె సుమన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను నేటికీ పరిష్కరించకపోవడంపై పలు గ్రామాల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా సక్రమంగా కాకపోవడంతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీల్లో కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయని, ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ కరెంటు బిల్లులకే పోతున్నాయని, పైగా అప్పులు చేయాల్సి వస్తుందని ఆయా గ్రామాల సర్పంచులు మండిపడ్డారు. దీనిపై ఎంపీపీ సుమన్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వేసవిలో నీటి సమస్య ఏర్పడకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ఒక పక్క గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తూ మరోపక్క కరెంటు బిల్లుల పేరుతో డబ్బులు వసూలు చేస్తుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కరెంటు బిల్లుల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ నాగార్జున రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ మండలాల ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.