Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వర్తకం ముసుగులో లీజు
అ అరకొర అద్దె చెల్లించి..అధికసొమ్మంతా కొట్టేసి..!
అ ఓపెన్ టెండర్ల కోసం నిరుద్యోగుల పట్టు
అ షాపులు మాకు ఇవ్వండి : నిర్వాసితుల గగ్గోలు
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి కొండపైన షాపులు కొంతమందికే సొంతమా.. జీవితకాలం వీళ్లే ఇక్కడ వర్తకం చేసుకోవాలా.. ఇక ఓపన్ టెండర్లు నిర్వహించరా.. షాపుల కేటాయింపులో అధికారుల ప్రమేయం ఎంత వరకు ఉంది..? తదితర అంశాలపై ఇప్పుడు యాదగిరిగుట్టలో తీవ్ర చర్చాంశనీయమైంది. ఒకసారి ఇక్కడ షాపు దక్కిందంటే చాలు. సర్కార్ కొలువు దొరికినంత ఫీలింగ్..! కొండపైన ఇప్పుడు 110 షాపులు ఉండగా సుమారు 10మందిలోపే నిజమైన వర్తకం సాగిస్తున్నారు. లీజుకిచ్చినోళ్లే ఇప్పుడు దీక్షలకు దిగారు. ఈ షాపులకు యేటా టెండర్లు నిర్వహించేదిబోయి 30శాతం పెంచిన అద్దె నివేదికను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు సమర్పిస్తారు. ఇక్కడి అధికారులు. టెండర్ ప్రక్రియ నిర్వహించకుండా అధికారులకు రెండు బంగారు గాజులు ఇది వరకే ముట్టజెప్పగా..మరో 2కోట్ల డీల్ కుదిరినట్లు అందులో ఒక కోటీ ముట్టజెప్పాలని వర్తకులు నిర్ణయించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నిరుద్యోగులు ఓపన్ టెండర్ల కోసం పట్టుబడుతుంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా వ్యవసాయ భూములు, వ్యక్తిగత ప్లాట్లు, ఇండ్లు, మెయిన్ రోడ్డుపై షాపులు కోల్పోయిన నిర్వాసితులు షాపులు తమకు కేటాయించాలని గగ్గోలు పెడుతున్నారు.
30 శాతం పెంచితే సరిపోతుందా..?
యేటా 30శాతం షాపుల అద్దె పెంచామని చేతులు దులుపుకుంటే సరిపోతుందా..! ఇంకా ఎంత ఆదాయాన్ని కోల్పోతున్నామో లెక్కలేయరా..? పోనీ..తప్పుడు లెక్కల తుప్పు దులుపే సంస్కృతి కమిషనర్ ఆఫీస్లో లేదా..? అసలు ఈ వర్తకులు అన్నదే జరగాలా..? అనే ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. కొంతమంది స్వలాభానికే 30శాతం అద్దె పెంచడం ఎందుకని యువత ప్రశ్నిస్తోంది. అయినా స్థానికులే వర్తకం చేయాలా..! ఇతర ప్రాంతాల వారు వర్తకం చేసుకొనే అవాకాశం ఎందుకు ఉండదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టెండర్లు ఎందుకు జరగవు...?
గడువు ముగిసిన షాపులకు నేటికి ఓపన్ టెండర్ల నిర్వహించకపోవడం ఇక్కడ శోచనీయమే. టెండర్లు ద్వారా మరింత ఆదాయం సమకూరుననే విషయం ఈ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఎందుకు తట్టదో..ఆ ఏకశిఖరవాసునికే ఎరుక..! టెండర్ ద్వారా షాపులు పొందినోళ్లు వర్తకం ఎందుకు చేయరూ..? వర్తకం చేయనోళ్లకు షాపులు ఎందుకు..? అని స్థానికంగా ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నా..ఇక్కడ లీజు బిజినెస్ కొన్నేండ్లుగా సాగుతున్న తంతే.
కోటీశ్వరులే ఎక్కువ....
దేవస్థానానికి తక్కువ అద్దె చెల్లించి..లీజుదారుల నుండి వేలకు వేల సొమ్ము ఈ వర్తకుల జేబుల్లోకి వెళ్తోంది. లీజుకిచ్చినోళ్లంతా.. ఇంచుమించు ఐటీ చెల్లిస్తోన్న కోటీశ్వరులే. వీరే మళ్లీ షాపులను కోరడం విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు. భవిష్యత్తులో కొండపైన ఎలాంటి షాపులు ఉండబోవని సీఎం కేసీఆర్ వ్యాఖ్యాల నేపథ్యంలో ఇక్కడి వర్తకుల్లో ఆందోళన మొదలయ్యి దీక్షలు చేపట్టడం గమనార్హం. వర్తకులుగా చలామణి అవుతోన్న వారిలో 10మంది లోపే ఉంటారు. మిగత వారు షాపులు లీజుకు ఇచ్చినోళ్లే.
నిరుద్యోగులు, నిర్వాసితుల గగ్గోలు...
అధికార పార్టీల భజన చేస్తూ..వీరు ఇన్నేళ్లుగా ఇక్కడి షాపుల యజమానులుగా చలామణి అవుతున్నారు. వీళ్లు కొండపైన తిష్ట వేయడంతో ఇక్కడి నిరుద్యోగ యువత జీవనోపాధి కోసం పట్నం అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఈ సందర్భంలో టెండర్ ప్రక్రియ చేపట్టాలని పలువురు నిరుద్యోగులు పట్టుబడుతుండగా ఆలయ అభివృద్దిలో భాగంగా ఇండ్లు, వ్యక్తిగత ప్లాట్లు, వ్యవసాయ భూములు కోల్పోయిన నిర్వాసితులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ స్పందన కోసం వీరందరు ఎదురుచూస్తున్నారు.
నిర్వాసితులకు షాపులు కేటాయించాలి : గౌళికర్ రాందయాల్ (నిర్వాసితుడు, యాదగిరిగుట్ట)
వ్యవసాయ భూములు, వ్యక్తిగత ప్లాట్లు, మెయిన్ రోడ్డుపై షాపులు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు కొండపైన షాపులు కేటాయించాలి. ఆలయ అభివృద్ధిలో భాగంగా పట్టణంలో చాలమంది ఆస్తులు పోగొట్టుకునోళ్లు ఉన్నారు. ప్రస్తుతం జీవనోపాధి లేక మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. షాపులు కేటాయించి మా కుటుంబాలను ఈ రకంగానైన ప్రభుత్వమే ఆదుకోవాలి.
ఈ సారి షాపులు కొత్తవారికే : రాంపల్లి రజనీకాంత్ (దాతర్పల్లి, యాదగిరిగుట్ట)
ఈ సారి షాపులు కొత్తవారికే ఇవ్వాలి. కొండపైన మాకే షాపులు కావాలనే ఈ వర్తకుల డిమాండ్ కరెక్టు కాదు. ఓపన్ టెండర్ ప్రక్రియను ఏర్పాటు చేయాలి. ఎదో కొంతమంది అధికారుల భజనపరులకే షాపులు దక్కడం సమంజసం కాదు. టెండర్ ద్వారా కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. అందులో నిరుద్యోగులు కావొచ్చు. నిర్వాసితులు కావొచ్చు. ఖచ్చితంగా అధికారులు పారదర్శకతను పాటించాలి.
మాకు షాపులు ఇవ్వండి : బూడిద నర్సింహా (నిర్వాసితుడు, యాదగిరిపల్లి)
ఆలయ అభివృద్ధిలో భాగంగా మా స్వంత పట్టా భూమి 6ఎకరాలు కోల్పోయాం. చాల విలువ గల భూమి కోల్పోవడంతో మా కుటుంబాలు తీవ్ర కష్టాలు పడుతున్నాయి. యాదగిరిపల్లి రెవిన్యూ పరిధిలో సుమారు 142 ఎకరాలు అభివృద్ధిలో భాగమైంది. అభివృద్ధికి తోడ్పాటును అందించిన తమకు కొండపైన షాపులు కేటాయించాలి.