Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
కేతినేని చెరువు అలుగు వద్ద నుండి రైతుల పంట పొలాలకు రక్షణ కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు.శనివారం మున్సిపాలిటీపరిధిలోని పిల్లల మర్రి రెవెన్యూపరిధిలోని కేతినేనిచెరువు అలుగును ఆయన పరిశీలించి మాట్లాడారు.ఇటీవల నిర్మాణం అవుతున్న సూర్యాపేట-ఖమ్మం365 రహదారి కాంట్రాక్టర్ కేతినేని చెరువు అలుగు వరద ప్రవహించే వాగును ఆక్రమించాడని విమర్శించారు.వాగుపై రోడ్డు నిర్మాణం చేసిన కారణంగా అలుగు వరద పోయేందుకు స్థలం లేక నీళ్లు ఒత్తిడికి గురై రైతుల వరి పంట పొలాల్లోకి నీళ్లు వచ్చాయన్నారు.ఫలితంగా 20 ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.వరి సాగు కోసం రైతులు ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడి పెట్టి సాగు చేసుకున్న పొలం వరదకారణంగా ధ్వంసమైందన్నారు.పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేయడం మూలంగా వాటిని తొలగించేందుకు రైతులపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని రోడ్డు కాంట్రాక్టర్‌తో మాట్లాడి అలుగు వల్ల రైతాంగానికి ఎలాంటి నష్టం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.వరి పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టం కింద ఎకరాకు రూ.50 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మందడి రాంరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్,రాయనిగూడెం మాజీ సర్పంచ్ ముత్యాల సైదులు, రైతుసంఘం నాయకులు గట్టుపల్లి సత్యనారాయణరెడ్డి, గుర్రంవెంకటరెడ్డి, జంగిలి లింగయ్య, నాగరాజు, నల్ల మేకల శ్రీను పాల్గొన్నారు.