Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న పనులపై రూపొందించిన ప్రతిపాదనలపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో చర్చించారు. శనివారం మున్సిపల్ చైర్మెన్ ఎం. సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, మున్సిపల్, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులతో వారు సమీక్షించారు. గత సంవత్సరం డిసెంబర్ 29న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించి సమీక్షా సమావేశం నిర్వహించి పట్టణ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. అనంతరం రాష్ట్ర పురపాలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కెేటీఆర్, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, రాష్ట్ర పురపాలన, పట్టణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ నల్గొండ పట్టణంలో పర్యటించి సమీక్ష సమావేశం నిర్వహించి చేపట్టనున్న పనుల పై చర్చించి పలు సూచనలు చేశారు. వారు రూపొందించిన పనుల డీపీఆర్‌ల పై సమావేశంలో కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి మార్పులు, చేర్పులు చేశారు. వారు సూచించిన మేరకు నల్గొండ పట్టణంలో చేపట్టనున్న జంక్షన్లు, రోడ్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, ఫూట్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ డెయ్రినేజీ, ఉదయ సముద్రం ట్యాంక్ బండ్, శిల్పారామం, అర్బన్ పార్క్‌లు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు, రైతు బజార్, వల్లభరావు చెరువు సుందరీకరణ ప్రణాళికలు, పాత పట్టణం అభివృద్ధి, వైకుంఠ ధామం లు, ఔట్ డోర్ స్టేడియం అప్ గ్రెేడే షన్, నీలగిరి కళా భారతి ఆడిటోరియం, హెలిపాడ్, స్వాగత తోరణాలు, లో వోల్టేజి సమస్య, నూతన సబ్ స్టేషన్ పనులపై కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన ప్రణాళికలపై సూచనలు చేశారు. సోమవారం హైద్రాబాద్‌లో రాష్ట్ర పురపాలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశంలో ఈ మేరకు ప్లాన్ సమర్పించి నిధులు మంజూరు కోరనున్నారు. బీట్ మార్కెట్లో శంకుస్థాపన చేసిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు మొదలు పెట్టాలని సమావేశం లో ఆదేశించారు. కోమటి రెడ్డి ప్రతీక్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన రైతు బజార్ పనులు, చర్లపల్లి దగ్గర ప్రాణ వాయువు అర్బన్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రమణా చారి, ఆర్ అండ్‌బీ ఎస్ఈ నరసింహ, పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, ఇరిగేషన్ అధికారులు బుచ్చి రెడ్డి, ప్రభు కళ్యాణ్ పాల్గొన్నారు.