Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
పేదల పెన్నిధి, ఐక్య పోరాటాల వారధి సీఐటీయూ అని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఆదివారం దొడ్డి కొమురయ్య భవన్లో సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ 1970లో కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడానికి ఐక్యత పోరాటం నినాదంతో ఆవిర్భవించిందని అన్నారు. నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాలు నిర్వహించి కార్మికుల హక్కులు కాపాడడంలో ముందుభాగాన ఉన్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే పోరాటాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం మార్చి 28, 29 తేదీలలో కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులతో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు బాణాల పరిపూర్ణచారి, హమాలీ ఫెడరేషన్ జిల్లా నాయకులు అవురేశు మారయ్య పాల్గొన్నారు.