Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం తేవాలని, కార్మిక లేబర్ కోడ్లను రద్దుచేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆ సంఘం నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ విగ్రహం వద్ద ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ చారిత్రా త్మకమైన రైతాంగ పోరాటంలో మరణించిన అన్నదాతలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కనీస మద్దతు ధర చట్టం చేయాలని కోరారు. విద్యుత్ సవరణ చట్టాన్ని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకాన్ని బలోపేతం చేయడానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, రోజు కూలీ రూ.600 ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, కత్తుల యాదయ్య, బాణాల పరిపూర్ణచారి, గంజి నాగరాజు, పోలగోని మల్లయ్య, నకిరేకంటి సుందరయ్య, శంకర్, యాదగిరిరెడ్డి , నరసింహ, కృష్ణయ్య పాల్గొన్నారు.