Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో చేనేత రంగానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం దొడ్డి కొమురయ్య భవన్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగం, నేత కార్మికుల జీవనోపాధిపై కరోనా తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్ నుండి చేనేత రంగానికి కేటాయిస్తున్న నిధులు క్రమంగా తగ్గిస్తూ ఈ బడ్జెట్లో కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించినట్లు పేర్కొన్నారు. దీనితో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాకపోగా టెక్స్టైల్ శాఖ ఉద్యోగుల వేతనాలకు మాత్రమే సరిపోతాయని అన్నారు. మొత్తం రూ.39.45 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో సుమారు 4 కోట్ల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది 0.005 శాతం మాత్రమే అన్నారు. ఇంత దిగజారుడు కేటాయింపులు గత 75 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. దీంతో చేనేత రంగం నిర్వీర్యమై ఆకలి చావులు, ఆత్మహత్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు. చేనేత రుణమాఫీ పథకం ప్రకటించినా అది వారి కుటుంబాలకు చేరనే లేదన్నారు. చేనేత రంగానికి కేంద్ర బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీరంగం, సహాయ కార్యదర్శి రావిరాల మారయ్య, జనార్ధన్, రావిరాల వెంకటేశం, రాపోలు వెంకన్న, గోశిక నర్సయ్య, నామ ప్రభాకర్ పాల్గొన్నారు.