Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
జిల్లా వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇల్లు లేని పేదలందరికీ వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆ పార్టీ మండల కార్యాలయంలో మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శివర్గ సభ్యులు కోట రామచంద్రరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేండ్ల కాలంలో జిల్లాలో ఓ ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇంటిని కూడా నిర్మాణం చేసి ఇవ్వలేదని విమర్శించారు. అసలు జిల్లాలో ఇండ్లు లేని పేదలు ఉన్నారన్న కనీస అవగాహన శాసన సభ్యులకు ఉన్నదా లేదా అని ప్రశ్నించారు. జిల్లాలో అక్కడక్కడా నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఎందుకు పంపిణీ చేయడం లేదని జిల్లా అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా నిర్మాణం పూర్తయిన ఇండ్లను వెంటనే ఈనెల చివరి వరకు పంపిణీ చేయాలని లేదంటే మార్చి మోదటివారంలో తామే లబ్దిదారులకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ పోచంపల్లి మండలంలో రసాయన పరిశ్రమలు వెదజల్లే పోల్యూషన్‌తో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు, మేకలు,గొర్రెలు, జీవరాశులు అనేక వ్యాధులతో మృతిచెందుతున్నాయన్నారు. అధికారులు పరిశ్రమల ద్వారా వస్తున్న పొల్యూషన్ అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రానున్నకాలంలో పొల్యూషన్ అరికట్టాలని పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాదం విష్ణు, గూడూరు బుచ్చిరెడ్డి, మంచాల మధు, అందల జ్యోతి, మండల కమిటీ సభ్యులు నేలికంటి జంగయ్య, నోముల కష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.