Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీశాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజా పంపిణీ వ్యవస్థను కాపాడుకునేందుకు భవిష్యత్తులో బలమైన పోరాటాలు నిర్వహించాలని మాజీశాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య కోరారు. శుక్రవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టజీవులకు కడగండ్లు కార్పొరేట్లకు కాసుల మూట అనే చందంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. బహుజనులను బలి చేస్తున్న కేంద్ర బడ్జెట్ అని ప్రజా పంపిణీ వ్యవస్థను నిలబెట్టుకునేందుకు భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మార్చిలో చలో ప్రభుత్వ గోడౌన్స్కు పిలుపు, ఏప్రిల్ నెలలో భూ పోరాటాలు, ఉపాధి చట్టం పటిష్ట అమలు కోసం సమరశీల ఉద్యమాలు , ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్ పై దేశ వ్యాప్త ఉద్యమాలకు వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చాయని ఆ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కష్టజీవులు బహుజనులను బలి చేసే విధంగా, కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలకు కాసుల వర్షం కురిపించేలా ఉందని విమర్శించారు. 39, 44, 900 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో 35 శాతంగా ఉన్న దళితులు, గిరిజనులకు కేవలం 13 వేల కోట్లు మాత్రమే కేేటాయించిందన్నారు. ఉపాధి హామీకి నిధులు తగ్గించటమే కాక ఆహార భద్రతను నిర్వీర్యం చేసే విధంగా గత సంవత్సరం కంటే 65 వేల కోట్లు కేటాయింపులు తగ్గించారని తెలిపారు. 8 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వ గోడౌన్లలో ముక్కిపోతున్నా పేదలకు ఇవ్వడానికి మనసొప్పడం లేదన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలహీనపరచడం అంటే ఎఫ్ సి ఐ కొనుగోలు తగ్గించటం, రైతు కనీస మద్దతు ధర చట్టం లేకుండా చేయడమేనని ఆయన అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరిగి సామాన్య ప్రజలపై మరింత భారం పడనుందన్నారు.లక్షలాది ఎకరాలు దళితులు, ఆదివాసీల నుండి అభివృద్ధి పేరుతో బలవంతపు భూ సేకరణ చేస్తున్నదని, దేశవ్యాప్తంగా సాగు భూములను కేంద పాలకులకు వత్తాసు పలికే కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా బడ్జెట్లో విధానాలను రూపొందించిందని తెలిపారు.పేదల వద్దనున్న భూములు బలవంతంగా పుంజుకోవడం నిరసిస్తూ ఉద్యమాలు చేయాలని పిలుపు నిచ్చారు. మరోవైపు ఎరువులు, పురుగు మందులకు, మొత్తంవ్యవసాయ రంగానికి నిధులు తగ్గించడమంటే రైతాంగంతో పాటు వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదల జీవితాలు అస్తవ్యస్తమవుతాయన్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అనే అంశం గురించి బీజేపీ ప్రభుత్వం ఆలోచించే ఊసే లేదని అన్నారు. గతంలో వ్యవసాయ కార్మికులు వెట్టి చాకిరీ చేసి పెత్తందారులను పోషిస్తే నేడు ఆ కష్టజీవుల బిడ్డలు నవీన వెట్టిచాకిరి చేయాలని హిందుత్వ శక్తులు ఈ బడ్జెట్ ద్వారా అటువంటి ప్రయత్నాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమించాలని, కార్మిక వర్గం మార్చి 28, 29 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను గ్రామీణ ప్రాంతాల్లో కూడా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఆహార భద్రత చట్టం సమగ్ర అమలు కోసం ఏప్రిల్, మే నెలలో ప్రభుత్వ గోడౌన్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య,డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్, ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు బాల సైదులు,రెమడాల భిక్షం,మండల అధ్యక్షుడు వెంకన్న,రైతు సంఘం జిల్లా నాయకులు రాగిరెడ్డి మంగరెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు రేమడల పరుశురాములు,డీవైఎఫ్ఐ నాయకులు పథాని శ్రీను,వినోదనాయక్,బాబునాయక్, నాయకులు జిట్టంగి సైదులు,తదితరులు పాల్గొన్నారు.