Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్
నల్లగొండ :పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల కూలి రేట్లు పెంచాలని తెలంగాణ పవర్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పవర్లూమ్ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31 నాటికి అగ్రిమెంట్ గడువు ముగిసిందని, అయినా కూలి రేట్లు పెంచకుండా యాజమాన్యం మొండివైఖరి తో ఉన్నదని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కరోనా నేపథ్యంలో కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న కూలి రేట్లు ఏ మాత్రం సరిపోవడం లేదని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి యజమానులు కార్మికులు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని కూలి రేట్లు పెంచుకునే సాంప్రదాయం గత 30 సంవత్సరాలుగా కొనసాగుతుందని అన్నారు. కానీ నేడు కూలి రేట్లు పెంచకుండా కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా యజమానులు నిర్లక్ష్య ధోరణి తో ఉన్నారని ఆరోపించారు. లేబర్ అధికారులు జోక్యం చేసుకుని జాయింట్ మీటింగ్ కు పిలిచినా కూలి రేట్లు పెంచేది లేదని యజమానులు తెలపడం సరికాదన్నారు. గత నెల రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనియెడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు. అనంతరం ఏడీఓ రంజిత్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య , సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నర్సింహ, జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు, పద్మానగర్, ఇండిస్టియల్ ఏరియా, చర్లపల్లి అధ్యక్షుడు భోగు సత్యనారాయణ, పెండెం బుచ్చి రాములు, చిట్టిపోలు వెంకటేశం, కటిక ఆంజనేయులు, దేవులపల్లి గిరిబాబు, కటకం రమేష్, గంజి బిక్షపతి, ప్రభాకర్, రాపోలు నరేష్, పొశం గిరి పాల్గొన్నారు.