Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగునాగార్జున
నవతెలంగాణ-దేవరకొండ
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతున్న దళితబంధు ఎంపిక అధికారం జిల్లా కలెక్టర్‌కే ఇవ్వాలని, ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమేయం లేకుండా చూడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండ పార్టీ ఆర్గనైజర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గానికి రెండు గ్రామాలు కాకుండా మొత్తం దళిత కుటుంబాలను ఎంపిక చేయాలన్నారు. దళితబంధు పధకం ఎన్నికల స్టంట్‌గా మారకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. జిల్లాలో భూముల సమస్యలు పేరుకుపోయాయని, ధరణి వలన అనేక సమస్యలు పెండింగ్లోనున్నాయని, రెవెన్యూ అధికారులు ధరణి పోర్టల్‌ను సవరించి రైతాంగ భూముల సమస్యలు పరిష్కరించాలని కోరారు. జిల్లాలో పీవోటీ భూముల సమస్యలు పెండింగ్లోనున్నాయని, రాష్ట్రమంతటా పరిష్కారమైనా నల్లగొండ జిల్లాలో అమలు చేయలేదన్నారు. దీని వలన రైతుబంధు అందడం లేదని, బ్యాంకుల ద్వారా రుణాలు పొందే పరిస్థితి లేదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చిందని, పనులు తగ్గించి బడ్జెట్లో కోత విధించడం అన్యాయమన్నారు. కోరిన ప్రతి వ్యక్తికి పని కల్పించాలనే ఉపాధిహామీ పథకం లక్ష్యం దెబ్బతీశారని పేర్కొన్నారు. రాబోయే వేసవిలో కోరిన ప్రతి ఉపాధి కూలీలకు పనులు కల్పించి రోజు కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తామని, ప్రజలు సన్నద్ధం కావాలని కోరారు. ఈ సమావేశానికి నల్ల వెంకటయ్య అధ్యక్షత వహించగా నాయకులు నాగటి నాగరాజు, బిజిలి లింగయ్య, నిమ్మల పద్మ, డిండి బుచ్చయ్య, బుడిగపాక బాలరాజు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.