Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నేటి నుంచి చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు
అ నేటి తేదీ రాత్రి కల్యాణం
అ పూర్తికాని ఏర్పాట్లు.. కనిపించని జాతర శోభ
అ తప్పని.. ట్రాఫిక్ తిప్పలు..
అ అంతంత మాత్రమే నీటి సౌకర్యం ..మరుగుదొడ్ల నిర్వహణ
అ ప్రమాదకరంగా ఘాట్‌రోడ్డుపై రక్షణ గోడలు
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
దక్షిణ తెలంగాణలో ప్రముఖ శివాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన శైవక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా విజంభిస్తున్న తరుణంలో ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించాలా వద్దా అనే సందిగ్ధంలో ఆలయ పాలకమండలి, దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారు. అనంతరం 8 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతులు ఇవ్వడంతో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు ఈ ఉత్సవాలకు హాజరు కావడం విశేషం.
నేటి నుంచి మొదలు
నేటి నుంచి 13వ తేదీ వరకు వేడుకలు వైభవంగా కొనసాగనున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8న ఉదయం దీక్షాదారణ, అఖండ స్థాపన, రాత్రి పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహౌత్సవం, 9న శేషవాహన సేవ,10న అగ్నిగుండాలు- పర్వతవాహన సేవ, 11న దోపోత్సవం-అశ్వ వాహన సేవ, 12న పుష్పోత్సవం-కల్పవక్షవాహన సేవ, 18న గజవాహనసేవతో ఉత్సవ పరిసమాప్తి జరగ నుంది. ప్రతీ సంవత్సరం రథసప్తమి రోజున స్వామి అమ్మవార్ల కల్యాణం జరగడం చెర్వుగట్టు క్షేత్ర విశిష్టత. వేదాక్షర సరస్వతీ బిరుదాంకితులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని ఆచార్య త్వమున, నీలకంఠశాస్త్రి వ్యాఖ్యాతగా దేవస్థాన ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఉత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. దేవస్థాన అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు మేకల అరుణా రాజిరెడ్డి, సభ్యులు ఈఓ కె.మహేంద్రకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది జాతర ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో నగరోత్సవాన్ని, తెప్పోత్సవాన్ని రద్దుచేశారు. గత ఏడాది కూడా ఈ వేడుకలను నిర్వహించలేదు.
పూర్తి కాని పనులు
ఉత్సవాలు ప్రారంభంకానున్నా కల్యాణ మండప విస్తరణ పనులు చేపట్టడం భక్తులను విస్మయ పరుస్తుంది.. దాంతో ఈ పర్యాయం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపి స్తున్నాయి.కల్యాణ మండపంపై వాస్తవానికి ఉత్సవమూర్తులను తూర్పునకు అభిముఖంగా ఆసీనులను చేసి కల్యాణం చేస్తుండగా ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో ఈ పర్యాయం ఉత్తరాభిముఖంగా ఆసీనులను చేసి నిర్వహించనున్నారు. కల్యాణ టికెట్ కొని వేదిక వద్ద దంపతులు కూర్చునే విధానాన్ని ఈసారి రద్దు చేశారు. స్వామివారి కల్యాణానికి లక్షలాది మంది భక్తులు తలంబ్రాలు రూపంలో బియ్యం, కొబ్బరి కుడకలు, జాకెట్ ముక్కలు సమర్పించు కోవడానికి పోటీపడుతుంటారు. తండోప తండాలుగా వచ్చే భక్తులు క్యూ లైన్ లో వచ్చే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. చెరువుగట్టు గ్రామానికి రోడ్డుపై వచ్చే పోయే దారి వేరువేరుగా లేకపోవడంతో ప్రతీసారి ట్రాఫిక్ సమస్య పోలీసులకు పరీక్షగా మారు తోంది. రెండో ఘాట్ రోడ్డు లేకపోవడంతో ఎదురెదురుగా వాహనాలు, పాదచారుల రాకపోకలు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. గుట్టపై మంచినీటి సమస్యను అధిగమించేందుకు ప్రజా ప్రతినిధులకు అధికారలకు చిత్తశుద్ధి లేకపోవడంతో గుట్టపై వచ్చే భక్తులకు తిప్పలు తప్పడం లేదు. మిషన్ భగీరథ పథకం మంజూరు చేయించడంలో పట్టుదల కన్పించడం లేదు. భగీరథ ద్వారా వీటిని గట్టు పైకి తీసుకెళ్లేందుకు రూ.కోటి 40 లక్షల పైపులైనుకు ఖర్చవుతుందని అంచనాలు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.
అంతంత మాత్రమే నీటి సౌకర్యం .. మరుగుదొడ్ల నిర్వహణ
గట్టుపై నీటి సౌకర్యం అంతంత మాత్రమే ఉండడంతో మరుగుదొడ్ల నిర్వహణ ఇబ్బందిగా మారింది. గట్టు పైన నామ మాత్రంగా మరుగుదొడ్లు ఉండడంతో జాతర కోసం తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసే పనుల్లో దేవాదాయ శాఖ అధికారులు నిమగం అయ్యారు. గత బ్రహ్మౌత్సవాల్లో జరిగిన ఇబ్బందులు పునరావృతం కావచ్చని సన్నాహక సమావేశంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘాటుగా స్పందించినప్పటికీ అధికారుల్లో చలనం కనిపించలేదు.
ప్రమాదకరంగా ఘాట్ రోడ్డుపై పై రక్షణ గోడలు
గుట్టపల్లి ఘాట్ రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన రక్షణ గోడలు నాసిరకంగా నిర్మించడంతో వర్షపు నీటి వరద పోటుతో కూలిపోయాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు వాహనదారులకు పాదచారులకు ఇవి ప్రమాదకరంగా ఉంది. పాదచారులు, వాహనదారులు గమనించకపోతే, ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.