Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
దళిత ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై స్పష్టత ఇచ్చిన తర్వాతనే జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించాలని మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపి బహిరంగా లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్నారు. ఒకవేళ మీవ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే మీరు రాజ్యాంగ బద్దంగా అనుభవిస్తున్న పదవులకు రాజీనామా చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో ఆరేండ్లకు పైగా అంబేద్కర్ ఆడిటోరియం పేరుతో భవనాలకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినా పూర్తిస్థాయి నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య దళిత సంఘం నాయకులు బండారు రవివర్ధన్ మున్సిపల్ కౌన్సిలర్లు ఈరపాక నరసింహ పడిగెల ప్రదీప్, సిరిపంగ శివలింగం, ఇటుకల దేవేందర్, అందే నరేష్, బండారు జహంగీర్ పాల్గొన్నారు.