Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు తీరని అన్యాయం చేశారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నల్లగొండ జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశం స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో మంగళవారం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మహిళ అయి ఉండి కూడా స్త్రీలకు బడ్జెట్ కేటాయించకపోవడం మహిళా లోకానికే మాయనిమచ్చ అన్నారు. మహిళల గురించి పుంఖాను పుంఖాలుగా ప్రసంగాలు ఇచ్చే బీజేపీ వారికి కేటాయించిన బడ్జెట్ చూస్తే ఏపాటి గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. మను ధర్మశాస్త్రం మహిళలను ఏవిధంగానైతే చిన్న చూపు చూసిందో అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా రెండో శ్రేణి పౌరులుగా చూస్తుందని వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగానైతే ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టారో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా మహిళలకు ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఐద్వా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రోజురోజుకు మహిళలపై దాడులు తీవ్రతరం అవుతున్నా, క్రైం రేటు రోజురోజుకు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాగితాల మీద మాత్రమే చట్టాల రూపకల్పన జరుగుతుంది కానీ ఆచరణలో అమలుకావడం లేదని వారన్నారు. భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా అనురాధా, జిట్ట సరోజ, నిమ్మల పద్మ ,నాగమణి ,భూతం అరుణకుమారి, కారంపూడి ధనలక్ష్మి, గౌసియా బేగం, సుల్తానా, వెంకటమ్మ, జయమ్మ పాల్గొన్నారు.