Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
అభ్యంతరాలు తలెత్తకుండా పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేపట్టాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మున్సిపల్ కౌన్సిలర్లకు సూచించారు. మంగళవారం భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లతో సమావేశమై లబ్ధిదారుల ఎంపిక పై చర్చించి కలెక్టర్ మాట్లాడారు. ప్రజలకు అత్యవసరమైన వాటిలో ఇండ్లు ఒకటని, నిరు పేదలకు వసతి కల్పించాలనే ఉద్దేశంతో భూపాలపల్లి పట్టణ పరిధిలో నిర్మించిన 960 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు అందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉన్నదని అన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. కౌన్సిలర్ల విజ్ఞప్తి మేరకు అర్హత ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని పేదలు మీ సేవా కేంద్రాల ద్వారా 11న సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. వివరాలను మున్సిపాలిటీ వార్డుల వారీగా కౌన్సిలర్లకు అందిస్తామన్నారు. ప్రతి వార్డుకు జిల్లా స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమిస్తామని, అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించాలన్నారు. రూ.10 లక్షల కలెక్టర్ నిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చామన్నారు. భవిష్యత్తులో పట్టణంలో మరిన్ని ఇండ్లను ప్రభుత్వం నిర్మించిస్తుందని అన్నారు. పట్టణ పరిధి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం పట్టణంలోని ఎర్ర చెరువును సందర్శించి భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాత్కాలికంగా వార సంత ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, మున్సిపల్ చైర్పర్సన్ షెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్తపల్లి హరిబాబు, భూపాలపల్లి తాసిల్దార్ ఇక్బాల్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ అవినాష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.