Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నుడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జి.ఓ.జారీ చేయటంతో నీలగిరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ -2022 ద్వారా ల్యాండ్ పూలింగ్ స్కీంతో ప్రభుత్వ వెంచర్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ప్రభుత్వం, పట్టాదారుల పరస్పర భాగస్వామ్యంతో అన్ని వసతులతో లేఅవుట్ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, భూయజమానులు పట్టాదారులతో ల్యాండ్ పూలింగ్ స్కీం పై అవగాహన కలిగిస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా నీలగిరి అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ కింద అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్ చుట్టుప్రక్కల నూతన వెంచర్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ల్యాండ్ పూలింగ్ అనేది కనీసం 50 ఎకరాల భూమితో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వెంచర్ అన్నారు. ఇందులో ప్రభుత్వ భూములు, పట్టా భూములు కలిగి ఉండవచ్చని అన్నారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా అన్ని నిబంధనలు పాటిస్తూ అత్యున్నత ప్రమాణాలతో అన్ని వసతులతో కూడిన వెంచర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని న్నారు. రైతులను వెంచర్ ఓనర్లుగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుంది అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చెయబోయే వెంచర్లో రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, కరెంట్ మొదలైన ఏర్పాట్లు ఉంటాయని, వెంచర్ ఏర్పాటు అయిన తర్వాత పార్కులు, రోడ్డు మొదలైన వాటికి వదిలి పెట్టిన తర్వాత మిగిలిన భూమిని రైతులకు 50 శాతం వాటా, ప్రభుత్వానికి 50 శాతం వాటా ఉంటుందని అన్నారు. ఈ వెంచర్ ఏర్పాటు లో మధ్యవర్తులు ఎవరూ ఉండరని, ప్రభుత్వం, రౖతుల మధ్యనే లావాదేవీలు ఉంటాయని పేర్కొన్నారు. మిగతా భూములతో పోలిస్తే రైతులకు వారి భూమి ధర కంటే ఎక్కువ రేటు లభిస్తుందని అన్నారు. ఇందుకోసం భూమి పట్టాదారులు ముందుకు వచ్చినట్లైతే ప్రభుత్వమే అన్ని ఖర్చులతో, డి.టి.సి.పి. లే అవుట్ అనుమతులతో కూడిన అభివృద్ధి చేస్తామన్నారు. భూ సేకరణ ద్వారా లాగా కాకుండా పట్టదార్ లకు ఇష్టమైతేనే భూమి ఇవ్వవచ్చని అన్నారు. అనంతరం వేలం పాట ద్వారా ప్రభుత్వ వాటాగా వచ్చిన ప్లాట్లను విక్రయించి దాని మీద వచ్చే ఆదాయంతో ఇతర అభివృద్ధి పనులు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కాలెక్టర్ రాహుల్ శర్మ, డివిజనల్ అధికారి జగదీశ్వర్ రెడ్డి, తహశీల్దార్ నాగార్జున, భూ యజమానులు, పట్టాదారులు, తదితరులు పాల్గొన్నారు.