Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సభ్యుల అధికారుల మధ్య చర్చేలేదు
అ గంటల వ్యవధిలోనే ముగింపు
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాల్లో సమస్యల పరిష్కారం, పనుల నిర్వహణ కోసం మూడు నెలలకోసారి నిర్వహించే జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు శుక్రవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. 1,7, 2,4, 5,6వ స్థాయీ సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన తూతూ మంత్రంగా జరిపి టీ, స్నాక్స్‌తో గంటల వ్యవధిలోనే మమ అనిపించారు. స్థాయీ సంఘ సమావేశంలో ప్రణాళిక, ఆర్థిక స్థాయి, పనుల కమిటీ, గ్రామీణాభివృద్ధి కమిటీ, విద్య, వైద్య సేవల కమిటీ, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నాయి.
స్థాయీ సంఘాల వారీగా....
గ్రామీణాభివృద్ధి చర్చలో ఆయా మండలాల్లో జెడ్పీటీసీలు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పనిదినాలు కల్పించి ప్రజలను ఆదుకోవాలని డీఆర్డీఏ పీడీ కోరారు.
ప్రణాళిక, ఆర్థిక స్థాయీ కమిటీ
ఎజెండాలో 14 అంశాలకుగాను కేవలం 3 అంశాలను మాత్రమే చర్చించారు. చర్చలో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రహదారులు, భవనాలను పూర్తి చేయడంలో జిల్లా అధికారులే అలసత్వం వహిస్తు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని, వారి పనితీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.
విద్య, వైద్య సేవల కమిటీ
ఎజెండాలో 9 అంశాలు పొందుపర్చగా 3 అంశాలపైనే చర్చ జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం బిల్లులను సక్రమంగా అందేటట్టు చర్యలు తీసుకోవాలని జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి డీఈవోను కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రజాప్రతినిధులు ఆయా స్కూళ్లలో తనిఖీలు చేసి పాఠశాలలకు అవసరపడే మౌలిక వసతులను గుర్తించి నివేదికను అందజేయాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులను భాగస్వాములుగా చేయాలని చైర్మన్ డీఈవోకు సూచించారు.
మహిళా సంక్షేమం ...
ఐదో స్థాయీ సంఘం మహిళా సంక్షేమం. ఈ సమావేశం చైర్మెన్ కంకణాల ప్రవీణ అధ్యక్షతన జరిగింది. ఎజెండాలో 11అంశాలు పొందుపర్చగా అన్ని అంశాలపై చర్చ జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీ పాఠశాలలను చైర్మన్, సభ్యులు తనిఖీలు నిర్వహించి టీచర్లు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి కమిటీ దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సమావేశాలకు జిల్లా అధికారులు రిపోర్టు ఇచ్చే సమయంలో వారి ఫోన్ నెంబర్లను కూడా జత చేయాలని పేర్కొన్నారు. తమ మండలంలో కొన్ని అంగన్వాడీ పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయని, వర్షం వచ్చిన సమయంలో పిల్లలు నీటిపైనే కూర్చోవాల్సి వస్తుందని, వాటికి మరమ్మతులు చేయించాలని త్రిపురారం జెడ్పీటీసీ భారతి అధికారులను కోరారు.
సాంఘిక సంక్షేమ శాఖ....
6వస్థాయి సాంఘిక సంక్షేమం. ఈ సమావేశం చైర్మెన్ నారబోయిన స్వరూపారాణి అధ్యక్షతన జరిగింది. ఎజెండాలో 12 అంశాలు పొందుపర్చగా అన్ని అంశాలపై చర్చ జరిగింది. ఈ అంశాలపై సభ్యులు ఎవ్వరూ చర్చించలేదు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె.వీరబ్రహ్మ చారి, డిప్యూటీ సీఈఓ జి.కాంతమ్మ, ఆయా సంఘాల జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కంట తడిపెట్టిన ఆర్సీవో
6వ స్థాయీ అయిన సాంఘిక సంక్షేమ సమావేశంలో బీసీ గురుకులాల ఆర్సీవో షకీలా కంటతడి పెట్టారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు ఎత్తవని, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు ఎందుకు హాజరుకావడం లేదని నిలదీయడంతో ఆర్సీవో షకీలా కంటతడి పెడుతూ క్షమించాలి అంటూ సమాధానం చెప్పారు.