Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్వస్తివాచనంతో పూజలు
అ బ్రహ్మాదిదేవతలకు ఆహ్వానం
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి ఆలయానికి అనుబంధంగా ఏటా జరిగే పాతగుట్ట జాతర శుక్రవారం ఉదయం 9గంటలకు స్వస్తివాచనం జరిపి అంకురార్పణ గావించి దేవతాహ్వానం పలికి శ్రీకారం చుట్టారు.ఆలయాన్ని, పరిసరాలను శుద్ధి చేసి మూలవర్యులకు నిజాభిషేకం చేసి త్రిచూర్ణ ఫలాన్ని అద్ది శ్రీస్వామి అమ్మవార్లను అలంకరించారు. పిదప విశ్వక్సేన పూజ నిర్వహించారు. మట్టి పాత్రలలో నవధాన్యాలు నింపి ఆగమశాస్త్రరిత్యా వైష్ణవ సంప్రదాయానుసారం పుణ్యహవచనం పూజ చేశారు.ఈ సందర్భంగా యాజ్ఞికులు హోమం నిర్వహించగా ఋత్వికులు పారాయణాలు చేశారు. అనంతరం కంకణధారణ కార్యక్రమం నిర్వహించారు. పంచారాత్రాగమశాస్త్రం ప్రకారం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు.యాజ్ఞికులు శ్రీస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్విజ్ఞంగా నిర్వహించేందుకు దేవతల అనుమతి తీసుకున్నారు.రాత్రి అంకురార్పణ, మృత్య్సగ్రహణం, ధ్వజపటాదివాసం తదితర వేడుకలు ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉపప్రధానార్చకులు అర్చక బృందం, పారాయణీకుల వేదమంత్రాల మధ్య వైభవంగా జరిగాయి. పుట్టమట్టితో యాగశాలలో నవధాన్యాలు నాటే పర్వాన్ని నిర్వహించారు. సకల దేవతలను ఆహ్వానించేందుకు, ఉత్సవాల వైభవాన్ని సంతరించజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈ క్షేత్రమందు ఆనవాయితీ. ఈ కార్యక్రమాల్లో ఆలయ ప్రధానార్చకులు మర్రిగంటి మోహనాచార్యులు, అర్చక బృందం ఉత్సవాలు నిర్వహించగా ఉత్సవ పెద్దలుగా ఆలయ ఇన్చార్జి ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నర్సింహామూర్తి దంపతులు, ఏఈఓలు దోర్భల భాస్కరశర్మ, ఈడూడెపు రామరావు, సూపరింటెండెంట్లు ఊడెపు వెంకటప్రసాద్, గజివెల్లి రఘు, శంకర్‌నాయక్, దొమ్మాట సురేందర్‌రెడ్డి, ఉద్యోగులు, సిబ్బంది, ప్రముఖులు పాల్గొన్నారు.
జాతరలో నేడు....
జాతరలో నేటి ఉదయం 10గంటలకు ధ్వజరోహణం, వేద పారాయణం నిర్వహిస్తారు. సాయత్రం భేరీపూజ, దేవతాహ్వానం జరుగును.