Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ-హాలియా
మున్సిపాల్టీ ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ఉపాధి పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హాలియా మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకు, పెద్దలకే పెద్దపీట వేసిందని, 80 శాతం మంది ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలకు పక్కన పెట్టిందని, ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా గత బడ్జెట్లో రూ.98 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.73 వేల కోట్లకు తగ్గించిందన్నారు. అంటే రూ.25 వేల కోట్లు నష్టం చేసిందని, అందుకే ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని, దానికి రూ.2 లక్షల 64 వేల కోట్లు కేటాయించాలని సూచించారు. లేనిచో దేశవ్యాప్తంగా తీవ్ర పోరాటాలు జరుగుతాయని హెచ్చరించారు. దేశ ప్రజల జపం చేస్తూ దేశ ప్రజలను దోచుకునే అంబానీ, ఆదాలకు లాభాలు చేకూర్చే పని పెట్టుకున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ పార్లమెంటులో అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బడ్జెట్ విషయం మాట్లాడకుండా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల మీద రాష్ట్రం మొత్తాన్ని తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మెరుగుపరచాలని, రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, అలాగే సంఘటిత-అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకుంటే సమరశీల పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రవినాయక్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ ఎఫ్ఐ జిల్లా అద్యక్షుడు ఆకారము నరేష్, నాయకులు రమేశ్, రవీందర్, జగదీశ్ పాల్గొన్నారు.