Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యకాస జాతీయకౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-సూర్యాపేట
ఉపాధిహామీచట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఉద్యమం తప్పదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు హెచ్చరించారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నర్సింహారెడ్డి భవన్లో 'కేంద్ర బడ్జెట్ ఉపాధిహామీకి కోత' అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు బలహీన పరిచేందుకు కుట్రలు పండుతుందని విమర్శించారు. నాలుగేండ్లుగా ఉపాధిహామీకి కేటాయింపులు తగ్గిస్తుందని విమర్శించారు.2020-21 లో రూ.98 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2022 -23 ఆర్థిక సంవత్సరానికిగాను కేవలం రూ.73 వేల కోట్ల కేటాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు.గత బడ్జెట్ లో కేటాయించిన వాటిలో రూ. 21 వేల కోట్లు నేటికీ విడుదల చేయలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేసిందని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు, శత కోటీశ్వరు లకు పన్నుల భారం 12 శాతం నుండి 7 శాతానికి తగ్గిందని ,పేద, మధ్యతరగతి ప్రజలపై మాత్రం పన్నుల భారం వేశారని అన్నారు. విద్యా ,వైద్యం, ఉపాధి , సంక్షేమ రంగాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.పట్టణ ప్రాంత పేదలను ఆదుకునేందుకు అన్ని పట్టణ, మున్సిపల్ కేంద్రాలలో ఉపాధి హామీ పనులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధికూలీలకు 200 రోజులు పనులు కల్పించి రోజుకు రూ.600 ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్లహసేన్, రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్‌కుమార్, తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం (బీకేఎన్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు, వత్తిసంఘాల జిల్లా కన్వీనర్ ఎల్గూరిగోవింద్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, ఐద్వా జిల్లా ప్రధానకార్యదర్శి మేకనబోయిన సైదమ్మ,జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి,పీవైఎల్ జిల్లా కార్యదర్శి కునుకుంట్లసైదులు, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు మద్దెలజ్యోతి,ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు యాదయ్య పాల్గొన్నారు.