Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ-దేవరకొండ
గంజాయి నిర్మూలనకు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి కోరారు. మంగళవారం స్థానిక సాయి రమ్య ఫంక్షన్ హాల్లో దేవరకొండ డివిజన్ పోలీసువారి ఆధ్వర్యంలో గంజాయి, ఇతర మారక ద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల నిర్మూలనపై ప్రజాప్రతినిధులకు కల్పించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు వాడటం వల్ల ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబాలు వీధుల పాలవుతున్నాయన్నారు. ముఖ్యంగా యువత గంజాయి తీసుకోవడం వల్ల విచక్షణ జ్ఞానం కోల్పోయి ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి ఉంటుందన్నారు. జిల్లాలో వందలకొద్ది సర్పంచులు ఉన్నందున గ్రామాల వారు సహకరించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇటువంటి వారు అడ్డుపడుతున్నారని, కరోనా మహమ్మారి వల్ల స్మార్ట్ఫోన్లతో ఆన్లైన్ తరగతులు నిర్వహించడం వల్ల కొంతమంది విద్యార్థులు అదుపులేకుండా చెడు మార్గాలను ఎంచుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు సామాజిక బాధ్యతగా గంజాయి నిర్మూలనకు సహహకరించాలన్నారు. గ్రామ స్థాయిలో కూడా గంజాయి నిర్మూలనపై కళా బృందాలచే అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో యువత గంజాయి సేవించిన అమ్మిన వారిపై స్థానిక ప్రజా ప్రతినిధులు నిఘా పెట్టి తమకు సమాచారం ఇవ్వాలన్నారు. రాష్ట్ర యువత గంజాయి మాదక ద్రవ్యాలు సేవించే పెడదారిన పడకుండా సీఎం కేసీఆర్ రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, పోలీసు, ఎక్సైజ్ అధికారులతో సమావేశాలు నిర్వహించి గట్టి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. గంజాయి మాదకద్రవ్యాల నిషేధిత నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించాలన్నారు. గంజాయి పండించిన, అమ్మిన గ్రామాలలో ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు తెలిపారు. డీఎస్పీ ఆనంద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేశ్వరి గంజాయి రహిత ప్రాంతంగా చేస్తామని ప్రజాప్రతినిధులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో దేవరకొండ సీఐ బీసన్న, రాంపల్లి కొండమల్లేపల్లి సీఐలు, డివిజన్లోని పది పోలీస్ స్టేషన్లలోని ఎస్ఐలు, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, ఎంపీపీలు నల్లగాసు జాను యాదవ్, మాధవరం సునీత జనార్దన్రావు, వంగాల ప్రతాపరెడ్డి, రేఖ శ్రీ, పార్వతి, జెడ్పీటీసీలు మారుపాకుల అరుణ సురేష్ గౌడ్, బాలు నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, డివిజన్లోని ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.