Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలగాణ- నల్లగొండ
నల్లగొండ పట్టణంలో రోడ్లపైన ఫుట్ పాత్ చిరు వ్యాపారాలు చేసుకుంటున్న పేదల నుండి మున్సిపల్ అధికారులు తై బజార్ పేరుతో రోజుకు రూ.100 పన్ను వసూలు చేయడాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం,పట్టణ కార్యదర్శి ఎండి సలీమ్ ఖండించారు. గురువారం జిల్లాకేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు పూలు, పండ్లు, టిఫిన్ సెంటర్లు, బట్టలు ,చెప్పులు ,ఇస్త్రీ డబ్బాలు, కొబ్బరిబొండాలు, జిరాక్స్ సెంటర్లు, పాన్ డబ్బాలు, సైకిల్ ,టూవీలర్, మెకానిక్ లు, జ్యూస్ బండి, అమ్ముకునే వారి నుండి మున్సిపల్ అధికారులు పన్నులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. రోజు మొత్తం వ్యాపారం చేసిన వంద రూపాయలు సంపాదించే లేని చిరు వ్యాపారుల దగ్గర వసూలు ఏమిటి అని ప్రశ్నించారు. తై బజార్లు నిర్మాణం చేసి , సౌకర్యాలు కల్పించి రోజుకు పది ,ఇరవై రూపాయలు వసూలు చేస్తే ఒక అర్ధం ఉంటుందన్నారు. పల్లెల్లో ఉపాధి కరువై పట్టణాలకు వలస వచ్చి అద్దె ఇండ్లలో ఉంటూ రోడ్లపైన జీవనోపాధి కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న పేదలపై భారాలు మోపే విధంగా మున్సిపల్ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. చిరు వ్యాపారుల నుండి అక్రమ వసూలు ఆపకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నర్సింహ, గుండాల నరేష్, తదితరులు పాల్గొన్నారు.