Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-హుజూర్ నగర్ టౌన్
సూర్యాపేట జిల్లా మత్స్య కార్మిక సంఘం రెండో మహాసభలు జయప్రదం చేయాలని సీీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభా పక్ష నాయకులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం హుజూర్నగర్లో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. మార్చి 7 న మేళ్లచెరువు మండల కేంద్రంలో జరుగు జిల్లా మహాసభకు జిల్లా వ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. మత్స్య కార్మికుల సమస్యలపై మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. మూసీ పరీవాహక ప్రాంతం, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం అయిన సాగర్ ఆయకట్టు నుండి మత్స్య సంపద దేశం నలుమూలలకు ఎగుమతి జరుగుతుందన్నారు. వేలాదిమంది చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నా మత్స్యకారులకు ఎటువంటి భద్రత లేక ఆందోళనలో ఉన్నారన్నారు. వందలాది చెరువులు కుంటలు కుంచించుకు పోతున్నాయని, వర్షాలు రాని ఈ పరిస్థితుల్లో సాగర్ కాలువల ద్వారా చెరువులు నింపేందుకు ఫీడర్ ఛానల్ లు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మహాసభల్లో వృత్తి రక్షణ, ఉపాధి, సామాజిక భద్రత వంటి అనేక అంశాలను చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి నాగారపుపాండు, మత్స్యశాఖ కన్వీనర్ శీలం శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్ రెడ్డి, వి.సైదులు, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, నాయకులు రేపాకుల మురళి, కాసాని వీరస్వామి, శీలం వెంకన్న, అరవింద్ పాల్గొన్నారు.