Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల అభిప్రాయం
నవతెలంగాణ-నల్లగొండ
హిజాబ్ పేరుతో జరుగుతున్న ఘర్షణలతో మహిళలు చదువుకు దూరమవుతున్నారని, దాని వెనుక రాజకీయ లబ్ధి దాగి ఉందని లెక్చరర్ సుధారాణి, అడ్వొకేట్ ఫాతిమాలు అభిప్రాయపడ్డారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికే మత ఘర్షణలు సృ ష్టించడం అలవాటుగా మారిందని అన్నారు. విద్యాలయాల్లో అలజడులు లేపి విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలిగించడం మానుకోవాలని కోరారు. డాక్టర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను కాలరాయాలని చూడడం అవివేకమని అన్నారు. హిజాబ్ ఎవరికీ ఆటంకం కాదని, అనాదిగా వస్తున్న ఆచారమేనని అన్నారు. నేడు దేశంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో స్త్రీ అక్షరాస్యత తక్కువగా ఉందని, వారు చదువుకున్నప్పుడే భావి భారత పౌరులను తయారుచేసి ఇవ్వగల్గుతుందని అన్నారు. చదివే లేకపోతే సంఘ విద్రోహ శక్తులుగా అరాచకులుగా తయారయ్యే పరిస్థితి దాపురిస్తుందని పేర్కొన్నారు. అందుకే విద్యాలయాల్లో శాంతిభద్రతలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అభిప్రాయపడ్డారు. డాక్టర్ ఏఏ ఖాన్ మాట్లాడుతూ హిజాబ్ ఘటన కర్నాటక ప్రభుత్వం సృష్టించిందేనని అన్నారు. దేశమంతా ఇలాంటి వాతావరణం కల్పించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ సర్వోన్నత న్యాయ స్థానాలకు ఉందని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలను అణిచివేయడానికి అనేక రూపాలుగా కుట్రలు చేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ వాడవాడలా కళాశాలల్లో విద్యాలయాల్లో విస్తృతంగా చర్చ జరపాలని, మనువాదుల ఆగడాలను ఎదుర్కోవాలని సూచించారు. ప్రభుత్వం ధనవంతుల కొమ్ము కాస్తుందని, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తుందని ఆరోపించారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హషం మాట్లాడుతూ హిజాబ్ వద్దనేవారు జై శ్రీరామ్ నినాదాలు ఎందుకు చేస్తున్నారో తెలపాలని అన్నారు. భారత ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి కులం, మతం సమస్య సృష్టించి తమ పబ్బం గడుపుకుంటోందని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మలం మహేష్ అధ్యక్షత వహించగా వక్తలు మౌలానా పాషా, జాఫర్ గనీ, మౌలానా, మహమ్మద్ హుస్సేన్, సీఐటీయూ నాయకులు ఎండీ. సలీం, యూసుఫ్ ఆలీ, మహబూబ్అలీ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేశ్, ఆవాజ్ నాయకులు ఎండీ.అంజాద్ ఖాన్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మి, నాయకు లు కొండా అనురాధ, తుమ్మల పద్మ, నిమ్మల పద్మా, జిట్ట సరోజా, భూతం అరుణ కుమారి, మహమ్మద్ గౌసియా, బేగం సుల్తానా, రెహానా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్, ఎమ్మెస్సెఫ్ జిల్లా నాయకులు మారపాక నరేందర్, డీవైఎఫ్ఐ నాయకులు యువరాజ్ రావన్, జగదీష్ , ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి సుకుమార్, సిద్ధూ పాల్గొన్నారు.