Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిక్కూ దివానా లేని పార్టీ కాంగ్రెస్
అ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి మరో పది ఏండ్లు ఎదురు లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ నాయక్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు శనిగ్రహంలా పడ్డాడని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో దిక్కు దివాణం లేని పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. కేసీఆర్ పథకాలతో మోడీ వణికిపోతున్నారని పేర్కొన్నారు. అందుకే పురిటిలోనే అణిచివేతకు కుట్రలు చేస్తున్నాడని అన్నారు. అందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. 36 పార్టీలను ఒప్పించి సాధించిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ అభివద్ధి ఢిల్లీకి సెగలు పుట్టిస్తున్నాయని, ఇక్కడి పథకాలపై ప్రజలు నిలదిస్తారన్న భయం మోడీకి పట్టుకుందన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ప్రభుత్వం 10 లక్షల మందికి కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ పథకాల కింద పేదలకు కట్నం ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. నాలుగు వేల కోట్లు రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని నిలబెట్టిన నేత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అని పేర్కొన్నారు. అభివద్ధిలో తెలంగాణ యూరప్‌ను మించి పోతుందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికులుగా పని చేయాలన్నారు.
అధ్యక్షుడి పదవితో మరింత బాధ్యత పెరిగింది
ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్
నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడి పదవితో మరింత బాధ్యత పెరిగిందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నాయక్ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా బాధ్యతలు చేపట్టిన రవీందర్ కుమార్ ను ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు, ఎంపీ టీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పూల శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్లగొండ నకిరేకల్, మిర్యాల గూడ, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు, నోముల భగత్, మునుగోడు మాజీ శాసన సభ్యులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్గొండమున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్ గౌడ్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు రాంచంద్రనాయక్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెద్దులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్, వ్యవసాయ కమిటీ ఛైర్మన్ బొర్రా సుధాకర్, సీనియర్ నాయకులు పంకజ్ యాదవ్, శరణ్య రెడ్డి, రాంబాబు నాయక్, పట్టణ అధ్యక్షులు పిల్లి రామరాజు యాదవ్, జిల్లా శంకర్, కార్యకర్తలు గిరిజన ప్రాంత అభిమానులు పాల్గొన్నారు.