Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నైలీ కంపెనీ ఎదుట బంధువుల ఆందోళన
అ మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్న యాజమాన్యం
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
నైలీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు అనారోగ్యానికి గురై సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ కంపెనీ ఎదుట బంధువులు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ పరిధిలోని టోల్ ప్లాజా సమీపంలో ఉన్న నైలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చిట్యాల మండలం గుడ్రాంపల్లి గ్రామానికి చెందిన కాసర్ల అశోక్(33) కొన్నేండ్లుగా కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. బ్యాటరీలను విడి చేసి అందులోని కాపర్‌ను వేరు చేసే పనిచేసేవాడు. అందులోని యాసిడ్ మిగిలిన రసాయన మూలాకాలు పీల్చడంతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. రెండు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన చికిత్స ప్పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతునికి ఒక పాప, బాబు ఉన్నారు.దీనితో కంపెనీలో విషపూరిత రసాయనంతో అనారోగ్యానికి గురైయ్యారని ఆరోపిస్తూ మృతుడి బంధువులు కంపెనీ ఎదుట ఆందోళన నిర్వహించారు. యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నేతి శ్రీనివాస్, ఎస్సైలు దైదా అనిల్,డి. యాకన్నలు కంపెనీ వద్దకు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూశారు.
-మృతుడి కుటుంబానికి 5 లక్షల ఇస్తామన్న యాజమాన్యం
మృతుడి బంధువుల ఆందోళనతో నైలీ కంపెనీ యాజమాన్యం,కాంట్రక్టర్ లు కలిసి రాజకీయ నాయకులు, బంధువులతో చర్చించి మతుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనితో మృతుడి బంధువులు ఆందోళన విరమించారు.