Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి
అ రానున్న రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి
30శాతం నిధులు కేటాయించాలి
అ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ-చౌటుప్పల్
అందరికి సమాన విద్య అవకాశాల కోసం విద్యార్థులు సంఘటితంగా ఉద్యమించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణకేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా మూడవ మహాసభలు నిర్వహించారు. విద్యార్థులు ఎస్ఎఫ్ఐ జెండాల చేతబూని నినాదాలతో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మార్కెట్‌యార్డులో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వనం రాజు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ పాలకవర్గాలు విద్యను వ్యాపారం చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు చదువులను దూరం చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్, విదేశీ యూనివర్శిటీలను తీసుకొస్తూ అంబానీ, అదానిలకు తివాచీలు పర్చుతూ ఊడిగం చేస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఉచిత హామీలు, తాత్కాలిక ఎన్నికల పథకాల బదులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనలో పాలకవర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. విద్యార్థులకు వర్తమాన ప్రమాణాలతో సాంకేతిక విద్యనందించాలని, జిల్లాలో విద్యాకేంద్రాలు కలిగిన భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేయాలన్నారు. అందరికి సమాన విద్య అవకాశాల కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాల్లో విద్యార్థులు భాగస్వాములై ఉద్యమించాలన్నారు. నాణ్యమైన చదువుల కోసం పోరాటాలే శరణ్యమన్నారు. పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ విద్యారంగానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులో బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల వివక్షత చూపుతుందన్నారు. రానున్న రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని, మన ఊరు మన బడిలో పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి అమలుచేయాలన్నారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు నిర్వహిస్తామ న్నారు. ఈ బహిరంగసభలో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి మల్లేశం, మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షులు బత్తుల శంకర్, జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, ఉపాధ్యక్షులు పల్లె మధుకష్ణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు రాజుపెరియర్, పల్లె శివకుమార్, నాయకులు పబ్బు పావని, వేముల జైపాల్, బుర్ర అనిల్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు గంటెపాక శివకుమార్ పాల్గొన్నారు.