Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
పట్టణానికి చెందిన ఆరోగ్య పర్యవేక్షకుడు, కవి, రచయిత నాశబోయిన నరసింహ (నాన) ఛత్రపతి శివాజీ అవార్డ్ అందుకున్నారు. ఆదివారం రాత్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం హైద్రాబాద్లో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకల సందర్భంగా వైద్య, ఆరోగ్య రంగంలో నైపుణ్యత ప్రదర్శించినందుకు గౌరవ ప్రదంగా ఆర్కే. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా విచ్చేసిన మల్కాజ్గిరి విశ్రాంత జడ్జి బి.మధుసూదన్, గాంధీనగర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డా.చిల్లా రాజశేఖర్ రెడ్డి, సినీ హిరో కిరణ్, ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ డా.రంజిత్ చేతుల మీదుగా నరసింహకు పురస్కారం, మెమెంటో అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈయన ప్రస్తుతం (ఎన్వీబీడీసీపీ) సబ్ యూనిట్ సికింద్రాబాద్ లో విధులు నిర్వహిస్తున్న నరసింహ గత ఇరవై రెండు యేళ్ళ నుంచి వైద్య ఆరోగ్య రంగంలో క్షేత్రస్థాయిలో వివిధ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో గ్రామీణ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఆయన వైద్యారోగ్య విశిష్ట సేవలకు గుర్తింపుగా తనకు ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు చెప్పారు. మరో వైపు ఈ పురస్కారం అందుకున్నందుకు వైద్యారోగ్యశాఖ సహౌద్యోగులు, సాహితీ మిత్రులు, బంధువులు నరసింహకు ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు.