Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్యారంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా మూడవ మహాసభలు రెండోరోజు పట్టణంలోని జయశ్రీ ఫంక్షన్హాల్లో 300 మంది ప్రతినిధులతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభ సూచకంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వనం రాజు ఎస్ఎఫ్ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల కాలంలో చనిపోయిన రైతులు, సైనికులకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులను నాణ్యమైన విద్య నుండి దూరం చేస్తున్న ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలన్నారు. దేవాలయాలపై ఉన్న శ్రద్ధ విద్యాలయాలపై లేదన్నారు. శాస్త్రీయ విద్యా విధానం వైపు నడిపించకుండా యూనివర్శిటీల్లో చేతబడి, బానుమతి, పిడకల తయారీ కోర్సులు తీసుకువస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్పులు, ఫీజు రీయీంబర్స్ మెంట్ విడుదల చేయడంలో విఫలం చెందిందన్నారు. మధ్యాహ్న భోజనంలో కోత విధించడం సరైంది కాదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హిజాబ్ పేరుతో రాష్ట్రంలోని విద్యాలయాల్లో విద్యార్థుల మధ్య వైషమ్యాలు పెంచిపోషిస్తుందన్నారు. మతోన్మాదులను పెంచి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ మహాసభల్లో టీఎస్యుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశం, ఆహ్వాన సంఘం అధ్యక్షులు బత్తుల శంకర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కల్లూరి మల్లేశం, జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, ఉపాధ్యక్షులు పల్లె మధుకష్ణ, నాయకులు పల్లె శివకుమార్, సూరేపల్లి మౌనిక, వేముల జైపాల్, బుర్ర అనిల్, ఆనగంటి హరీశ్, బర్రె రాజు, మనోజ్, దొడ్డి లింగస్వామి పాల్గొన్నారు.