Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
పాఠశాలల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ''మన ఊరు- మనబడి, మన బస్తీ-మన బడి'' కార్యక్రమం చేపట్టిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో ఈ కార్యక్రమం విధి విధానాలు, అమలుపై ఉదయం నకిరేకల్, మిర్యాలగూడ, తుంగతుర్తి (శాలి గౌరారం మండలం) నియోజకవర్గాలకు, మధ్యాహ్నం నల్గొండ, నాగార్జునసాగర్ నియోజక వర్గాలకు సంబంధించిన మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, సర్పంచ్ లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీలు, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, విద్య, సంక్షేమం మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈలు, డీఈలు ఏఈలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా మూడు సంవత్సరాలలో సంతృప్తి స్థాయిలో అన్ని పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు బడిపై ఆసక్తి కలిగించి, విద్యలో మెరుగైన ఫలితాలు వచ్చేలా పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో మొదటి విడతగా విద్యార్థులు అత్యధిక నమోదు కలిగిన 517 (35 శాతం) పాఠశాలలు ఎంపిక చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులైన తాగునీరు, విద్యుదీకరణ, ఫర్నీచర్, పాఠశాలలకు పెయింటింగ్ వేయడం, నీటి వసతితో టాయిలెట్, పెద్ద, చిన్న తరహా మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డ్, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, శిథిóలభవనాల స్థానంలో నూతన గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్లు, డిజిటల్ విద్య వంటి వసతుల కల్పన ద్వారా బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. నియోజక వర్గం, మండలం యూనిట్‌గా, ప్రతి మండలానికి ఇంజనీరింగ్ అధికారులను కేటాయించడం జరిగిందని వీరు ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలలను పరిశీలించి 12 అంశాల్లో చేపట్టాల్సిన పనుల జాబితాల అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న గదుల స్థానంలోనే నూతన గదుల నిర్మాణం చేపట్టాలని, పై కప్పు నుండి పెచ్చులూడి, నీరు కురిసే సమస్యలు ఉన్న పాఠశాలల్లో వాటర్ ప్రూఫ్ రూఫింగ్ వంటి మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు. పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ వివరాలు అందిస్తే రాష్ట్ర స్థాయిలో కొనుగోలు చేసి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రహరీ గోడ, నీటి వసతితో మరుగుదొడ్లు, కిచెన్ షెడ్డు మొదలైన పనులు ఉపాధిహామీ నిధులతో చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో ఎంపీడీఓలు రేపు సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. పథకం కింద రెండు కమర్షియల్ బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని సూచించారు. రూ.30 లక్షల వరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రూ.30 నుండి 50 లక్షల వరకు ఈ ఈ, రూ.50 లక్షల నుండి 2 కోట్ల వరకు ఎస్ఈ, రూ.2 కోట్ల పైన టెక్నికల్ ఇంజనీర్లు మంజూరు చేస్తారని అన్నారు. ఇసుక ఉచితంగా సరఫరా చేస్తుందని, సిమెంట్ ధర రైతు వేదికలు నిర్మించిన విధంగా ధర నిర్ణయించి ప్రభుత్వం కంపెనీలను ఎంపిక చేస్తుందని అన్నారు. మిర్యాలగూడ శాసన సభ్యులు ఎన్.భాస్కర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో కార్యక్రమాలు అమలు చేసిందని, వైకుంఠ దామాలు, పల్లె ప్రకతి వనంలు, రైతు వేదికలు నిర్మాణం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంకు ఎక్కడైనా నిధులు అవసరమైతే తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ గుడి లాగా బడిని తీర్చిదిద్దాలని ఆయన అధికారులను కోరారు. కార్పొరేట్ స్కూల్ స్థాయిలో పాఠశాలను తీర్చిదిద్దాలన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో మొదటి విడతగా 125 స్కూల్స్‌ను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చెట్లు పెంచి, తరగతి గదులను అందంగా తీర్చిదిద్ది, టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తే ఆ పాఠశాలకు మొదటి బహుమతిగా రూ.2 లక్షల 50 వేలు, రెండో బహుమతి లక్ష రూపాయలు, మూడో బహుమతిగా రూ.50 వేలు సొంతంగా అందజేస్తానని భూపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్, జెడ్పీసీఈఓ వీర బ్రహ్మచారి, డీఈ. ఓ భిక్షపతి, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు రోహిత్ సింగ్, జగదీశ్వర్ రెడ్డి, రాజ్ కుమార్, సల్మా భాను, డీపీఓ విష్ణు వర్ధన్, డీఆర్డీఓ కాళిందిని, పీఆర్‌ఈఈ తిరుపతయ్య పాల్గొన్నారు.