Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో , రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గినందునే దోచుకునే వాళ్ల సంఖ్య పెరిగిందని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డి అన్నారు. సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లాకార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తండ్రి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ముదిరెడ్డి లింగారెడ్డి సంస్మరణ సభ బుధవారం మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులు సీట్లు, ప్రభావం తగ్గడం వల్లనే దోపిడీిదారుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రజలకు అందించే దానికంటే పాలకులు తింటున్న సొమ్మే అధికంగా ఉందన్నారు. తెలంగాణలో నైజాం సర్కార్‌తో యుద్ధం చేసింది కమ్యూనిస్టులేనని, వారి త్యాగాల ఫలితంగానే చైతన్యం పెరిగిందని తెలిపారు. విద్య యొక్క అవసరాన్ని నాడు గుర్తించి రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటంలోనూ ఎర్రజెండా ప్రభావం ఉందన్నారు. అందులోనూ లింగారెడ్డి పాత్ర మరువలేనిదని తెలిపారు. ఆయన పార్టీని , కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని తెలిపారు. ప్రత్యర్థులు ఆర్థికంగా నష్టం కలిగించినా ఏనాడు కుంగిపోలేదన్నారు. వ్యవసాయాన్ని రెండింతలు చేస్తన్న మోడీ నేడు ధాన్యం కొనుగోలు చేయనని అంటున్నారని అన్నారు. అంతేగాకుండా ఉత్పత్తి ఖర్చులు కూడా బాగా పెంచుతున్నారని తెలిపారు. మతోన్మాదులు రాచిరంపాన పెడుతు న్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ నీళ్లు ఇచ్చిన ముచ్చట ఒక్కటే చెపుతున్నారు తప్ప మరోకటి లేదన్నారు. ప్రతిపక్షాలు సూచన చేస్తే కూడా విమర్శగా తీసుకుంటున్నారని, కానీ తన పాలన తీరును పరిశీలించుకోవడంలేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ముదిరెడ్డి లింగారెడ్డి 25ఏండ్ల ప్రాయంలోనే ఎర్రజెండాకు ఆకర్షితుడై , ప్రాణం పోయేవరకు ఎత్తిన జెండాను దించకుండా , తన శవాన్ని కూడా ప్రజలకు అంకితం చేసిన గొప్ప ఆదర్శమూర్తి అని అన్నారు. సాయుధ పోరాట కాలంలో ఆయన ఇల్లే ఒక ఉద్యమ కేంద్రంగా నిలిచిందన్నారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తాను ఉన్నానని భరోసా ఇచ్చారని తెలిపారు. దేశంలో వ్యవసాయం రంగం అతిముఖ్యమైందని దానికోసం పెద్దకుమారుడిని, ఎర్రజెండా కోసం చిన్న కుమారుడిని తయారు చేసిన గొప్ప మానవతా విలువలు కలిగిన నాయకుడని పేర్కొన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా కుటుంబం మొత్తం నిలబడడం అంటే సామాన్య విషయం కాదన్నారు. ప్రత్యర్థులు తన తోటను నష్టపరిచి ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్ర చేసిన ఏనాడు కుంగిపోలేదన్నారు. గ్రామంలో పార్టీని నిలబెడుతూనే చుట్టుపక్కల గ్రామాలకు కొండంత దైర్యాన్ని ఇచ్చిన ఎర్రజెండా బిడ్డ లింగారెడ్డి అని పేర్కొన్నారు. తనను కూడా సొంత కుమారుడి వలే ఆదరించిన ఆదర్శమూర్తి అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నాడు అమలులో ఉన్న రక్షణ కౌలుదారి చట్టం రద్దుకోసం పోరాటం చేసిందీ కేవలం కమ్యూనిస్టులేనని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి ఉండి కూడా ఆ చట్టం తెలంగాణాలోనే అమలు చేశారని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఏడాది పాటుగా ఢిల్లీ కేంద్రంలో జరిగిన రైతు పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర అత్యంత గొప్పదని అన్నారు. ఇపుడు దోపిడీ పరోక్ష పద్ధతిలో పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దోపిడికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు జీడీ నర్సింహరావు మాట్లాడుతూ స్వార్థం లేకుండా నిష్కల్మషంగా ప్రజల కోసం పనిచేసిన నాయకుడు ఎపుడు పేదల గుండెల్లో నిలిచిపోతారని, ఆ కోవకు చెందిన వారే లింగారెడ్డి అన్నారు. 100ఏళ్లు జీవించి ఏనాడు మడమ తిప్పకుండా పేదల జీవితాల కోసం పనిచేశారని పెర్కొన్నారు. అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమ ంలో సూర్యాపేట జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, లింగారెడ్డి తనయులు ముదిరెడ్డి రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు నారీ అయిలయ్య, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, పార్టీ మండల కార్యదర్శి రొడ్డి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి పుల్లెంల శ్రీకర్, స్థానిక ఎర్ర సర్పంచ్ కన్నయ్య తదితరులు పాల్గొన్నారు