Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-మునుగోడు
స్వాతంత్రోద్యమం నుండి నేటి వరకు ప్రజల తరఫున నికరంగా పోరాడుతున్న నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. గురువారం మునుగోడు అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ఒక్కరోజు రాజకీయ శిక్షణాతరగతులకు చాపల మారయ్య ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా బండ శ్రీశైలం శిక్షణాతరగతులను ప్రారంభించి మాట్లాడుతూ నేడు దేశంలో చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మినట్టుగా దేశభక్తి ముసుగులో ప్రజాసంపద కొద్దిమంది కార్పొరేట్లకు నరేంద్ర మోడీ దోచి పెడుతున్నారని విమర్శించారు. 75 ఏండ్ల స్వాతంత్ర ్యభారతదేశంలో ప్రజల రెక్కల కష్టంతో నిర్మించుకున్నాం రైల్వే, బీఎస్ఎన్ఎల్, బ్యాంకులు, ఇన్సూరెన్స్, విమానయానం, భూములు, గనులు, చమురు, రహదారులు, సహజ వనరులతో పాటు రక్షణ రంగాన్ని సైతం కారుచౌకగా అమ్ముతూ కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశభక్తులు కమ్యూనిస్టులేనన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన 39 లక్షల కోట్ల బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే వెంపర్లాడడం జరిగిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు వ్యతిరేకంగా నేడు జరిగే దేశవ్యాప్త నిరసనలలో కార్మికులు రైతాంగం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. శిక్షణాతరగతిలో పార్టీ కార్యాక్రమాలను జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు చిన్నపాక లక్ష్మినారాయణ బోధించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, చండూరు మర్రిగూడెం మండల కార్యదర్శి బోట్ట శివకుమార్, ఏర్పుల యాదయ్య, వివిధ మండలాల నాయకులు మిరియాల భరత్, కొమ్ము లక్ష్మయ్య, యాసరాణి శ్రీను, హన్మయ్య, పరమేష్, రాజయ్య,వరికుప్పల ముత్యాలు, వీరమల్లు, వేముల లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.