Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చుట్టూ ఎత్తైన కోడలు, పచ్చని చెట్ల మధ్య లాంచీ ప్రయాణం
అ నేడు శివరాత్రికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్న భక్తులు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని శ్రీ కాత్యాయిని సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే సాహసయాత్ర చేయవలసిందే! నాగార్జునసాగర్ జలాశయంలో ఐలాండ్ బౌద్ధ మ్యూజియం గురించి అందరికీ తెలిసిన విషయమే. జలాశయం నడిమధ్యలో ఎత్తైన కొండపై కొలువై ఉన్న చారిత్రక ఐలాండ్ టెంపుల్ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఏలేశ్వరం గట్టు శివాలయం పర్యాటకపరంగా, చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఏలేశ్వరం గత 50 సంవత్సరాలుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో, మునిగిన గ్రామాల్లో ఒకటి. 1962 నుండి ఏలేశ్వరం బాహ్య ప్రపంచంతో పాక్షికంగా సంబంధాలు తెగిపోయాయి. అప్పుడప్పుడు నాటు పడవల్లో కొంతమంది భక్తులు వెళ్లి దర్శించుకున్నా పూర్తిగా మాత్రం 2006 సంవత్సరం నుండి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శ్రీశైల ఈశాన్య ద్వారంగా ప్రసిద్ధి చెందిన ఏలేశ్వరం ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. బహత్ శిలా యుగం నాటి ఆదిమ మానవుల ఆధారాలతో పాటు కాకతీయుల కాలం వరకు ప్రతి రాజవంశానికి సంబంధించిన శాసనాధారాలు ఇక్కడ లభ్యమైనాయి. శాతవాహనుల కాలంలో శ్రీ పర్వత విశ్వవిద్యాలయంగా, ఇక్ష్వాకుల కాలంలో వారి రాజధాని విజయపురిగా ఈ ప్రాంతం వెలుగొందింది. ఏలేశ్వరం మల్లన్నను దర్శించుకోవాలంటే రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు సాగర్ దగ్గర ఉన్న అనుపు అనే ప్రాంతం నుండి మరియు తెలంగాణ టూరిజం వారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీ నుండి లాంచీలను శివరాత్రి పర్వదినాన మాత్రమే పర్యాటక శాఖ లాంచీలు ఏర్పాటు చేస్తారు. నదిలో దూర ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.1000 అడుగుల ఎత్తున్న ఏలేశ్వరం గుట్టపైకి చేరాలంటే పల్నాటి రాజుల కాలంలో నిర్మించిన పదహారు వందల రాతి మెట్ల మార్గం ఉంది. ఈ మార్గం శిథిలమై చాలా కఠినంగా ఉండటంతో 2017 సంవత్సరంలో కొంత దూరం నడక దారి ఏర్పాటు చేశారు. నదీ మార్గంలో 26 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మనం కొండకు చేరుకోవచ్చు. హరహర మహాదేవ శంభో స్మరణలతో వివిధ ప్రాంతాల గిరిజనులు అడవులు, కొండలు కోనలు నల్లమల వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. దాదాపు 30 వేలకు పైగా భక్తులు మల్లయ్యను దర్శించుకుంటారు. లాంచీ నుండి దిగి కొండపైకి చేరుకునే మార్గంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కమిటీగా ఏర్పడి భక్తులకు అన్నదానం చేస్తారు. శివరాత్రి పర్వదినాన తెలంగాణ పర్యాటక సంస్థ నాగార్జున సాగర్ హిల్ కాలనీ నుండి మల్లయ్య గట్టుకు బోటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.200, పిల్లలకు 150 రూపాయల టికెట్ ధరను నిర్ణయించారు.