Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గడ్కి..గడ్కి అడ్డం పడుతుండ్రు
అ ఫించన్లతోనే పర్వంతపాయే
అ ఐన ఇరాం లేకుండా తిరగవట్టే
అ ఆగవయ్యా...ఆగు : ఎమ్మెల్యే గొంగిడి సునితమ్మ
నవతెలంగాణ-యాదాద్రి
ఆలేరు నియోజకవర్గమోళ్లు ఎమ్మెల్యే సునితమ్మను ఒదుల్తలేరు.. ఒశపడనిస్తలేరు. నియోజకవర్గం అంతా గాయి..గాయి జేస్తుండ్రు. ఈడ ఎతిరేకంతో ఎటు ఏగలేక ఎమ్మెల్యే సునితమ్మమేమో మంది మీద కోపం జేస్తుండ్రు. ఊర్లపోంటీ మీటింగ్లల్లో ఎమ్మెల్యే పరేషాన్ అయితుండ్రు. యాడికోయిన అడ్డం మాట్లాడుతుండ్రు. ఊర్లల్లో డెవలప్మ్ంట్ ప్రోగ్రాంలో గీ ముచ్చట్లతోనే పర్వంతవాయే. డబుల్ బెడ్ రూం ఏదీ..? మాల, మాదిగలకు మూడు ఎకరాల భూమేది..? ఫించన్లు ఏవి..? కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ల పైసలేవి..? దళిత బందు అందరికి ఏది..? అన్ని కులాలోల్లకు గూడ బందు ఇయ్యాలె అంటూ మీటింగుల్లో ఉన్నోళ్లంత గట్టిగనే అర్సుకుంటుండ్రు. ఈళ్లందరికి సమాధానం చెప్పలేక మాట్లాడనిస్తరా..లేదా..? అంటూ ఎమ్మెల్యే కస్సుబుస్సు అయితుండ్రు. శెప్పటోడు చెమిటోడ్కెతే ఇనేటోనికి ఇజ్జత్ ఉండాలెగా అనే కేసీఆర్ జెప్పిన శాత్రం గిప్పుడు యాదికొస్తుంది.
ఇశ్పెడ్తలేరు..ఒశపడనిస్తలేరు
గవర్నమెంట్ లోన్లే (ప్రభుత్వ పథకాలే) ఎమ్మెల్యేను మీటింగులె కానిస్తలేవు. యాడికోయిన గివే ముచ్చట్లతోని సంపుతుండ్రు అక్కడోళ్లు. డబుల్ బెడ్ రూం కోసం, దళితులు మూడెకరాల భూమి కోసం, ఫించన్ల కోసం శాతగాని ముసళోల్లు (ఆడోళ్లు, మగోళ్లు) పెనిమిటి లేనోళ్లు, పెండ్లిళ్లుజేసిన కన్నోళ్లు కల్యాణ లక్ష్మీ, షాద్ముబారక్ల పైసల కోసం, కేజీ టూ పీజీ సదువులు, దళితులేమో ఆళ్ల బందు కోసం ఇంకా ఊర్లల్లా ఇంకో కులపోళ్లంత బందులు కావాలని మీటింగ్లు యాడ జరిగిన ఆడ ఎమ్మెల్యేను ఇశ్పెడ్తలేరు...ఒశపడనిస్తలేరు.
లోన్లతోనే పర్వువాయే..
దళిత బందు సురువు జేసిన డేట్లల్లో యాదాద్రిభువనగిరి జిల్లా డెవలప్ కోసం మున్సిపాలిటీలకు 50లచ్చలు, ఊర్లకు 25లచ్చల లెక్క ఇస్తానని తుర్కపల్లి మండలం వాసాలమర్రి కాడా సీఎం కేసీఆర్ శెప్పిన తొలుత మాటలు ఈడ ఇంకా ఇనిపిస్తునే ఉన్నయి. గిదాని కోసమే గిప్పుడు అంతట డెవలప్మెంట్ ప్రొగ్రాంలు నడుస్తున్నయి. గిద్జెప్పడానికే ఫిబ్రవరి 2న యాదగిరిగుట్టలో ఆళ్ల ఇంట్లో ప్రెస్మీట్ పెట్టిండ్రు ఎమ్మెల్యే. ఆ తర్వాత 17 తారీఖు నాడు ఈ కార్యం యాదగిరిగుట్ట మండలంలో సురువు చేసిండ్రు. ఇగ జూసుకో అప్పట్నుండి ఇరాం లేకుండా రయ్యా..రయ్యా ఓ...ఒకటే తీరుగా మీటింగులాయే...ఒకటే తిరుగుడాయే. కేసీఆర్ ఇట్ల జెప్పిండు అట్ల జెప్పిండని ఒకటే తీర్గా ముచ్చట్లు జెప్పవట్టే ఎమ్మెల్యే సునితమ్మ.
గీమె గిట్ల మాట్లాడ్తదేంది..
పోయిన్నెల 21 తారీఖున గుండాల 18, 22న ఆత్మకూర్, 23న మోటకొండూర్, 24న తుర్కపల్లి, 25న రాజపేట, 26న ఆలేరుల్లో ఒపనింగులప్పుడు ఎమ్మెల్యేను అస్సలు మాట్లాడినియ్యలె. ఏందమ్మ నువ్వు జేసిందో గి ముచ్చట్లు ఇని ఇని ఇంతవరకు ఏమిరాకపాయే అంనుకుండ్రు అక్కడోళ్లు. మీటింగులో కేసీఆర్ ఇద్జేస్తరు..అద్జేస్తరని శెప్పే ముచ్చట్లకు అక్కడోళ్లంత ఇర్లమర్ల జోపిండ్రు. అప్పుడు శెప్పే ముచ్చట్లు ఆపల్నో..అట్నే జెప్పాల్నో..ఎటు తోయక మంది మీద గడ్కి గరంకాబట్టే ఎమ్మెల్యే. ఆమె మాట్లాడె తరీక జూసి ఈ సారి ఎమ్మెల్యేగా వద్దకుంటుండ్రా ఏమి..టికెట్ రాదని ఇట్లు మాట్లాడుతుండ్ర అని అందరు అనుకుండ్రు. అదిగిచ్చి..బుదిగిచ్చి శెప్పుకునేదివోయి గట్ల మాట్లాడవట్టే అని కొపం జేసిండ్రు అందరు.
తల్కాయ పట్టుకుంటుండ్రు....
ఈ ఊరికి మీటింగు పోవాలె..ఆ ఊరికి మీటింగు రావాలె అని గద్వలు వట్టుకుంటిరి. అప్పుడె మరిశిపోయిండ్రా అని దీర్ఘం తీసిండ్రు. మీవోళ్లకు అన్ని లోన్లు ఇప్పిస్తిరి మాకియ్యకపోతిరి. ఈ సారి ఇంటికైతే రాండ్రి. ఎవరన్న ఇయ్యమన్నారా..! మీ కాళ్లు మొక్కిండ్రా..! మైకులు పెట్టి ఇంత పొడుగు శెప్పింది మీరు. అని అందరు అంటుంటే ఊకెనన్నా పెట్టుకుంటి గీ ప్రొగ్రాంలు అనుకుండ్రు ఎమ్మెల్యే. సీఎం ఏమో ఇప్పటి నుండె జనంలోకి వెళ్లమని శెప్పవట్టే. మందిలకు వొతనేమో గిట్లకావట్టే. ఎట్ల జేయాలె ఏమి జేయాల్నని తల్కాయ పట్టుకుంటుండ్రు.
ఆగవయ్యా..ఆగు : ఎమ్మెల్యే సునితమ్మ
ఆగవయ్యా..ఆగు అంటూ ఎమ్మెల్యే సునితమ్మ ఆడునోళ్లను గదిరిస్తుండ్రు. మాట్లాడనిస్తావా. లేదా..? అంటూ తప్పులు తీస్తుండ్రు. నువ్వే మాట్లాడుకో మరి అంటూ నిషఉ్ఠరమాడుతుండ్రు. ఆడోడు..ఈడోడు మోపైనారూ..? అంటూ కేసీఆర్ డ్కెలాగులు కొడుతుండ్రు. గిట్ల జేసే తెలంగాణలో కేసీఆర్ జేస్తున్న డెవలప్మెంట్ ఆపుతుండ్రు. పురాగ శెప్పె ముచ్చటన్నా ఇనాలె. ఏమి జెప్పుతుండ్రు..ఎందుకు జెప్పుతుండ్రు..జెరనన్నా సొయుండాలె అని కొపంతోనే నాలుగు ముచ్చట్లు జెప్పి ఎల్లి పోతుండ్రు ఎమ్మెల్యే.