Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాల పిలుపు
నవతెలంగాణ-నల్లగొండ
దేశాన్ని రక్షించుకుందాం ప్రజలను కాపాడుకుందాం అనే నినాదంతో 10 కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఉద్యోగం ఫెడరేషన్స్ ఆధ్వర్యంలో ఈనెల 28,29 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీి, టీఆర్ఎస్ కేవీ, ఐఎఫ్టీయూ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్బంగా తుమ్మల వీరారెడ్డి, చిన్న పాక లక్ష్మీనారాయణ, దండెంపెల్లి సత్తయ్య, పల్లా దేవేందర్ రెడ్డి, ఎండీ. జమాలుద్దీన్, ఎండి. మొయినుద్దీన్, గుర్రం వెంకటరెడ్డి, ఆచారి, బొమ్మిడి నగేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాకులను కొట్టి గద్దలకు చేసిన చందంగా దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా దోచి పెడుతున్నారని అన్నారు. 44 కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడులుగా మార్చి కార్మికులను మరింత దోచుకోవడానికి పెట్టుబడిదారులకు అవకాశం ఇచ్చారని విమర్శించారు. నేడు దేశంలో నిరుద్యోగం, పేదరికం విలయతాండవం చేస్తుందని, డీజిల్ పెట్రోల్ ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోక పోగా ఇటీవల పెట్టిన బడ్జెట్ పెట్టుబడిదారుల, రాయితీలు ఇచ్చి పేదల సంక్షేమానికి కుదించిందని అన్నారు. కరోనా వచ్చి కార్మికులు ఉపాధి కోల్పోయి ఆదాయాలు పడిపోయి ఆకలితో అలమటిస్తుంటే ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వదిలేసి భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సమ్మెను జిల్లాలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మె జయప్రదం కోసం ఈనెల 10న అన్ని కార్మిక సంఘాలతో జిల్లా సదస్సు, 13 నుండి 17 వరకు నియోజకవర్గ సదస్సులు, 25, 26 తేదీల్లో మండల, పట్టణ కేంద్రాలలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కోటగిరి శేఖర్, వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.