Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్యాలయం ఎదుట కాలనీవాసుల ధర్నా
నవతెలంగాణ-మిర్యాలగూడ
మంచినీటి కోసం కాలనీవాసులు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. పట్టణంలోని బాపూజీనగర్ ఏడో వార్డుకు చెందిన కాలనీవాసులు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం గేటు ఎదుట నిరసన తెలిపారు. అధికారులు మొండి వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. వీరికి సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా బాపూజీ నగర్ కాలనీవాసులకు మంచినీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా వేయలేదని, ఇంటింటకీ నల్లా కనెక్షన్ బిగించలేదని, కనీసం బోరు నీరు రావటం లేదని అన్నారు. ఇప్పటికే కాలనీవాసులు రెండుసార్లు ఆందోళన చేసినా అధికారులు, పాలకపక్షం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన వెంటనే సరఫరా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్‌కు వినతి పత్రం సమర్పించారు. పైపులైన్ పనులకు టెండర్లు పూర్తయ్యాయని సోమవారం నుంచి పనులు వేగవంతం చేయిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) 2 టౌన్ కార్యదర్శి బావాండ్ల పాండు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబొయిన వరలక్స్మి, కౌన్సిలర్ నాగలక్స్మి, జాని, యువజన కాంగ్రెస్ నాయకులు అజారోద్దీన్, వెంకటేశ్వర్లు, పూలమ్మ, చెరుకు రాములు, భూపతిరావు, నరసింహులు, పార్వతమ్మ, కులయమ్మ, భారతమ్మ, మన్నెమ్మ, శ్రీను, అలివేలు పాల్గొన్నారు.