Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దేశాల మధ్య ఉన్న సమస్యలకు చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ ఎంతటి సమస్యనైనా దేశాలు కూర్చొని చర్చించుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం వస్తుందన్నారు. ఉక్రెయిన్ నాటోలో చేరడం ద్వారా రష్యాకు ప్రమాదముందన్నారు. అయితే యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్లో సుమారు 18వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారన్నారు. వారిని ఇండియా రప్పించేందుకు మోదీ సర్కార్ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. యుద్ధం జరుగుతుందని వారం రోజుల ముందే ప్రకటన వెలువడిన తర్వాత అన్ని దేశాలు తగిన చర్యలు చేపట్టినా మోదీకి ఏమాత్రం పట్టలేదన్నారు. ఆ దేశంలో ఇప్పటికే దేశానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిదే కానీ రాష్ట్ర పాలనపై కూడా దృష్టిసారించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ఏడేండ్లుగా ఇండ్ల్ల నిర్మాణం పెండింగ్లోనే ఉందన్నారు. పింఛన్ల్లు ఇవ్వలేదని, భూ సమస్యలు కూడా పరిష్కరించలేదని విమర్శించారు. ఇండ్లు లేని పేదలతో ప్రభుత్వ భూముల్లో గుడిసేలు వేయిస్తామని, దానికోసం పెద్దఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. 2019లో ఇచ్చిన పింఛన్ జీవో ప్రకారం పెండింగ్లో ఉన్న పింఛన్లు బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కండ్లు తెరిచి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ ఏడాదే ఎన్నికలోచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుందన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చిన ప్రజా ఉద్యమాలను నిర్మించి సమస్యలు పరిష్కరించుకునేలా పోరాడుతామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి.జహాంగీర్, వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, కేంద్ర కమిటీి సభ్యులు జి.నాగయ్య, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, అధ్యక్షులు బి. ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు , యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కొండమడుగు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.