Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పడిపోయిన టమాట ధర...!
- మార్కెట్‌కు తరలిస్తే రవాణా చార్జీలు వెళ్లని పరిస్థితి
- పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చేదెలా.. రైతుల ఆవేదన
నిన్న మొన్నటి దాక ఆకాశాన్నంటిన టమాట ధర.. ఒక్కసారిగా పడిపోయింది. అక్టోబర్‌లో కిలో రూ. 90కి అమ్ముడుపోగా.. నేడు రూ.5 చేరుకుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. పంట చేతికందే సమయానికి ధరలు విపరీతంగా పడిపోవడంతో పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీర్చడమెలాగో తెలియక అయోమయానికి గురవుతున్నారు. టమాటను మార్కెట్‌కు తరలిస్తే అక్కడ లభించే ధర.. రవాణా చార్జీలకు కూడా సరిపోవడం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు .
నవతెలంగాణ -నల్లగొండ
నల్లగొండ జిల్లాలో 238 ఎకరాల్లో 272మంది రైతులు టమాట సాగు చేశారు. సాగర్ నియోజకవర్గంలో 23 ఎకరాల్లో 21మంది రైతులు, దేవరకొండ నియోజకవర్గంలో 62 ఎకరాల్లో 100మంది రైతులు, మిర్యాలగూడ నియోజకవర్గంలో 42ఎకరాల్లో 37 మంది రైతులు, మునుగోడు నియోజకవర్గంలో 36 ఎకరాల్లో 39 మంది రైతులు నకిరేకల్ నియోజకవర్గంలో 37 ఎకరాల్లో 39మంది రైతులు నల్లగొండ నియోజకవర్గంలో 38ఎకరాల్లో 36 మంది రైతులు టామటాను పండిస్తున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 149.04 ఎకరాల్లో 241 మంది టామాట సాగు చేశారు. తుంగతుర్తిలో 2.17 ఎకరాలు, తిరుమలగిరిలో 5.16 ఎకరాలు, మద్దిరాలలో 05. జాపిరెడ్డిగూడెంలో 3.10ఎకరాలు, సూర్యాపేటలో 2.33, పెన్‌పహాడ్‌లో 35.36, చివ్వెంలలో 49.02, ఆత్మకూర్‌ఎస్‌లో 23.08, నడిగూడెంలో 2.01, మునగాలలో 6.34, మోతోలో 5.15, కోదాడలో 4.19, పాలకవీడ్లో 024, గరిడేపల్లిలో 0.16, చింతలపాలెంలో 1 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 635 ఎకరాల్లో టమాటా సాగు చేశారు.
రెండు నెలల క్రితం ఆకాశానికి ఎగబాకిన టమాట ధర నేడు అమాంతం పడిపోయింది. అక్టోబర్ మాసం లో టమాట ధర కిలో రూ. 90 అమ్ముడుపోగా నేడు కిలో టమాట రూ. 5 చేరుకుంది. దీంతో రైతన్నలు ఆందో ళన చెందుతున్నారు. టమాటను మార్కెట్‌కు తరలిస్తే... కనీసం రవాణా చార్జీలు కూడా మిగలటం లేదంటు న్నారు. జిల్లాలో 8 వ్యవసాయ మార్కెట్లు ఉన్నప్పటికీ.. కనీసం ఏ ఒక్కచోటా శీతల గిడ్డంగులు లేవు. దీంతో నష్టాలను చవిచూస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో రూ.5 కిలో తీసుకుంటున్న వ్యాపారులు బయట అంగట్లో కిలో రూ. 8 అమ్ముకుంటున్నారు. కష్టపడి పండించిన రైతుకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి.
ఏడాది పొడవునా డిమాండ్ ఉండే ఎర్రపండు (టమాట) ప్రస్తుతం ఏడుపును మిగిల్చింది. టమాట ధర ఒక్కసారిగా పడిపోయింది. వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవటం తో ఆందోళనకు గురవుతున్నారు. టమాట పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని వాపోతున్నారు. మార్కెట్‌కు తరిలించిన టమాట 25 కిలోల బాక్స్‌కు క్వాలిటీని బట్టీ రూ. 50 నుంచి రూ. 80 వరకు అమ్ముడు పోతుంది. ఈ లెక్కన చూస్తే.. నెంబర్ 1 రకం 5 రూపాయలకు అమ్ముడుపోతుంది. మామూలు రకం టమాట కిలో రు.3 అమ్ముడుపోతుంది. టమాట మార్కెట్‌కు అధిక మొత్తంలో తరలి రావడంతో ధర ఉన్నట్టుండి పడిపోయింది. గిట్టుబాటు ధరలేని కారణంగా మార్కెట్‌కు తరలించిన టమాటను పలువురు రైతులు నేలపై పారబోసి వెళుతున్నారు. నల్లగొండ జిల్లాలో వర్షాకాలంలో టమాటను 6 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేశారు. జిల్లాలో ఎక్కువగా దేవరకొండ, గుర్రంపోడ్, మల్లెపల్లి, , కనగల్, కొప్పోల్, నల్లగొండ మండలంలోని అన్నా రెడ్డిగూడెం, గుండ్లపల్లి, దుప్పలపల్లి, తోరంగల్ , కంచనపల్లి తదితర గ్రామాల్లో టమాట పంటలను ఎక్కువగా సాగుచేశారు.ప్రస్తుతం పంటను కోసేందుకు కూలీలకు వెచ్చించిన డబ్బులు కూడా రావటం లేదనీ, మార్కెట్‌కు తరలించినా కనీసం రవాణా చార్జీలూ మిగలటంలేదని రైతులు కలతచెందుతున్నారు. జిల్లాలో ఈసారి వేసిన టమాట పంట నష్టాల ఊబిలోకి నెట్టేసింది. జిల్లాలో బోరుబావులున్న ప్రతి రైతు టమాట పంటను సాగు చేశారు. ప్రధానంగా టమాటోకు గిట్టుబాటు ధరం లేకపోవటం, ధరల నిలకడ లోపించడం తదితర కారణాలవల్ల ప్రస్తుత సీజన్లో టమాటో రైతుల పరి స్థితి దయనీయంగా తయారైంది.ఎకరానికి సుమారు రూ. 30 వేల వరకు పంటకోసం పెట్టిన పెట్టుబడులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గాల్లో గిడ్డంగులు ఏర్పాటు అయ్యేనా...?
ఎంతో కష్టపడి పండించిన పంటలను నిలువ ఉంచు కునేందుకు అవకాశం లేకపోవటంతో రైతులు తీవ్రం గా నష్టపోతున్నారు. ఎన్నో ఏండ్లుగా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయిస్తామంటున్న పాలకుల మాటలు నీటి మీద బుడగలా మిగిలిపోతున్నాయి. పండించిన పంట లకు గిట్టుబాటు ధరరాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. తాము పండించిన కూరగాయలు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకుంటే వాటిని నిలువ ఉంచటానికి వీలుగా జిల్లా కేంద్రంలో శీతల గిడ్డంగులు, మార్కెటింగ్ రవాణావంటి సౌకర్యాలు లేనందున తప్పని పరిస్థితు ల్లో పంటలను అమ్ముకుంటున్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. కానీ.. జిల్లాలో శీతల గిడ్డంగులు మిర్యాలగూడలో ఒక్కటే ఉండటం తో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా నియోజకవర్గానికి ఒక శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
బొట్టు పెట్టుకున్న రైతు
రైతును ఆదుకోవాలి..
పంతంగి యాదయ్య గుండ్లపల్లి టమాట రైతు
టమాట రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. రెండు ఎకరా ల్లో టమాట పంట సాగుచేశా. ఎకరానికి రూ. 40 వేల వరకు పెట్టుబడి పెట్టా. పంట దిగుబడి బాగానే ఉంది. మార్కెట్‌కు తరలిస్తే... గిట్టుబాటు ధర రావటం లేదు. కిలో రూ. 5 అమ్ముడు పోయింది. రవాణ చార్జీలు కూడా రావటం లేదు.
ధరలను నియంత్రించాలి..
రాజిరెడ్డి గుండ్లపల్లి టమాట రైతు
పంట దిగుబడి వచ్చిన సమయంలో గిట్టుబాటు ధర ఉండ టం లేదు. దీంతో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. పంటకు పెట్టిన పెట్టుబడులు దేవుడు ఎరుక.. కనీసం రవాణా ఛార్జీలు కూడా మిగలడం లేదు.
శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి
బండ శ్రీశైలం .రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడు, కొప్పోల్, కనగల్,దేవరకొండ, కొండ మల్లేపల్లి,నల్లగొండ మండలంలో రైతులు ఎక్కువగా కూరగాయ పంటలు పండిస్తున్నారు. అందు లో టమాట పంట ఎక్కువగా ఉంది. వ్యవసాయ మార్కెట్లో శీతల గిడ్డంగులు లేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాటిని వెంటనే ఏర్పాటుచేయాలి. ఎన్నో ఏండ్ల నుంచి శీతల గిడ్డంగులు ఏర్పాటుచేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు... రైతుల సమస్య తీరటంలేదు.