Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మేళ్లచెరువు
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మత్స్యకారుల రెండో జిల్లా మహాసభలు మేళ్లచెరువు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో, చెరువులు కుంటలు కబ్జా కోరల్లో చిక్కుకుని పోయాయని, వాటిని కాపాడాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని పేర్కొన్నారు. మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతున్నా ఆయన గడ్డం పెరిగింది గానీ కార్మికుల జీతాలు ఒక రూపాయి కూడా పెరగలేదని ఎద్దేవా చేశారు. నల్లధనాన్ని బయటకి తెచ్చి భారతదేశంలో ప్రతి కుటుంబానికి 15 లక్ష రూపాయలు ఖాతాలలో జమ చేస్తానని చెప్పి 15 రూపాయలు కూడా చేయలేదని అన్నారు. నల్ల ధనం ఉన్న వ్యక్తులు అందరూ మోడీ స్నేహితులే అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి దేశంలో 750 మంది రైతుల ఆత్మహత్యకు కారణమయ్యారని అన్నారు. లాభాల్లో నడిచే ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నాగవరపు పాండు, పల్లె వెంకట్ రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సైదులు శేఖర్, హుస్సేన్, నాగేశ్వరరావు, వీరయ్య, అంజయ్య, జగనన్న, సముద్రం శీను, లింగయ్య అధిక సంఖ్యలో మత్స్య కారుల సంఘం కార్మికులు పాల్గొన్నారు.