Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ
నవతెలంగాణ- భువనగిరిరూరల్
రెండో విడత గొర్రెల పంపిణీ కోసం బడ్జెట్లో ఆరువేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరి తాసిల్దార్ వెంకటరెడ్డికి జీఎంపీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదన్నారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆచరణలో గొర్రెల పంపిణీ కి ఏమాత్రం సరిపోదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 13,427 యూనిట్లకు గాను సుమారు 180 కోట్లు అవసరముందన్నారు. ఖాళీగా ఉన్న పశు వైద్య సిబ్బందిని భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మద్దేపురం బాల్ నరసింహ, ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దేవునూరి బాలయ్య, పాక జహంగీర్, జిల్లా కమిటీ సభ్యులు తెల్జురి మల్లేష్ యాదవ్, కడారి రాములు పాల్గొన్నారు.
చౌటుప్పల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గొర్రెలు, మేకల పెంపకందారులకు ఆరువేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరుతూ మంగళవారం జీఎంపీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నర్సింహా మాట్లాడారు. గొర్రెల పంపిణీ పథకం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సగం మంది పెంపకందారులకే అందిందన్నారు. మొదటి, రెండో విడతలకు సంబంధించి మూడు లక్షల 65వేల మంది పెంపకందారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారని తెలిపారు. బడ్జెట్లో వేయి కోట్లు మాత్రమే కేటాయించారని, దీనిని సవరించి ఆరు వేల కోట్ల రూపాయలు మంజూరుచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు నార్లకొండ నర్సింహా, కొండె శ్రీశైలం, నాయకులు భీమగోని బాలరాజు, చెరుకుపల్లి బుచ్చయ్య, లింగస్వామి, సత్యనారాయణ, జంగయ్య, స్వామి, బీరప్ప, సంతోశ్, రాములు, వెంకటేశ్ పాల్గొన్నారు.